ఉద్దేశ పూర్వకంగా దుష్ప్రచారం | Yellow Media Making False Allegations On Ys Jagan Govt In Medical Sector | Sakshi
Sakshi News home page

ఉద్దేశ పూర్వకంగా దుష్ప్రచారం

Published Sat, Nov 13 2021 11:02 PM | Last Updated on Sat, Nov 13 2021 11:59 PM

Yellow Media Making False Allegations On Ys Jagan Govt In Medical Sector - Sakshi

సాక్షి, అమరావతి: విప్లవాత్మక సంస్కరణలతో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై కొందరు ఉద్దేశ పూర్వకంగా దుష్ప్రచారాలకు దిగుతున్నారు. ఇలాంటి వారికి ఎల్లో మీడియా కొమ్ముకాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాన్ని చేపడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్‌ఐడీసీ)కు వైద్య ఉప కరణాలు సరఫరా చేసిన బిల్లులు నాలుగైదేళ్లుగా సకాలంలో రావడం లేదంటూ ఓ సంస్థ ఉద్దేశ పూర్వకంగా అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడికల్‌ డివైజస్‌ ఇండస్ట్రీ(ఏఐఎంఈడీ)‍కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఏఐఎంఈడీ వాస్తవాలు తెలుసుకోకుండా ఏపీఎంఎస్‌ఐడీసీకి వైద్య ఉపకరణాలు సరఫరా చేయొద్దంటూ ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఇవీ వాస్తవాలు..

  • మందులు, వైద్య ఉపకరణాలు కొనుగులుకు గత టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు రూ.1442.65 కోట్లు ఖర్చు చేసింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 2019-20లో రూ.300.07 కోట్లు, 2020-21లో రూ.1,279 కోట్లు, 2021-22లో ఇప్పటి వరకు రూ.641.41 కోట్లు.. మొత్తంగా రూ.2220.48 కోట్లు వెచ్చించింది.
  • ఈ బిల్లులతో పాటు, టీడీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.300 కోట్లకు పైగా బిల్లుల్ని చెల్లించింది. ప్రస్తుతం కొన్ని బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో ఉన్నాయి. టెండర్ల సమయంలో ఎంవోయూ కుదుర్చుకున్న ప్రకారం ఉప కరణాలు, మందులు సరఫరా చేసిన సంస్థలకు ఏపీఎంఎస్‌ఐడీసీ బిల్లుల మంజూరుకు చర్యలు తీసుకుంటోంది. 
  • దేశంలోని మిగిలిన రాష్ట్రాల తరహాలోనే ఏపీలోను బిల్లుల మంజూరు జరుగుతోంది. ఏవైనా సంస్థలు ఏంవోయూలోని నిబంధనలను పాటించకున్నా, నాణ్యమైన మందులు, ఉపకరణాలు సరఫరా చేయకుంటే ఆ తరహా సంస్థలకు బిల్లుల మంజూరు విషయంలో కొంత జాప్యం జరుగుతోంది. ఆయా సంస్థలు నిబంధనలను అతిక్రమించిన దానిని బట్టి బిల్లుల్లో సవరణలు చేసి నిధులు మంజూరు చేస్తున్నారు.  

ఓ సంస్థ చేసిన పనే ఇది

  • ఏఐఎంఈడీకి తప్పుడు ఫిర్యాదులు చేసి ప్రకటన జారీ చేసేలా చేయడం వెనుక ఓ సరఫరా సంస్థ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. సదరు సరఫరా సంస్థ గత ఏడాది కోవిడ్‌ వైరస్‌ నిర్ధారణ కిట్‌ల సరఫరా టెండర్‌ను దక్కించుకుంది. ఏపీకి సరఫరా చేస్తున్న ధరల కంటే తక్కువ ధరలకు ఇతర రాష్ట్రాలు, ఇన్‌స్టిట్యూట్‌లకు కిట్‌లు సరఫరా చేస్తే.. ఆ తక్కువ ధరలనే ఏపీఎంస్‌ఐడీసీ చెల్లిస్తుందనే నిబంధన ఉంది.
  • ఈ నేపథ్యంలో ఈ సరఫరా సంస్థ ఏపీ కన్నా తక్కువ ధరలకు ఇతర రాష్ట్రాల్లో కిట్‌లు సరఫరా చేస్తుందని గుర్తించిన ఏపీఎంస్‌ఐడీసీ అధికారులు ఒప్పంద నిబంధనల మేరకు మిగులు బిల్లులను సవరించి విడుదల చేస్తామని ఆ సంస్థకు నోటీసులు జారీ చేశారు.
  • ఈ సవరణల్లో భాగంగా సదరు సంస్థకు బిల్లు చెల్లింపుల్లో కొంత ఆలస్యం కావడంతో దీని యజమాని.. వాస్తవాలు కప్పి పెట్టి ఏఐఎంఈడీ.. హెచ్చరికలు జారీ చేసేలా చక్రం తిప్పినట్టు సమాచారం. 

ఏఐఎంఈడీకి నోటీసులు ఇచ్చాం
ఏఐఎంఈడీ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండానే తొందరపాటుతో తన వెబ్‌సైట్‌లో ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లిస్తూ వస్తోంది. గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ వరకు వైద్య ఉపకరణాలు, మందులు సరఫరా చేసిన సంస్థకు రూ.1,407 కోట్లు ఇచ్చాం. కరోనా చికిత్స మందులు, వైద్య పరికరాలు సరఫరా చేసిన సంస్థలకు రూ.514 కోట్లు ఇప్పటికే చెల్లించాం. ఏఐఎండీ చేసిన ప్రకటన వెనుక దురుద్దేశం ఉందని గమనించి ఆ సంస్థకు నోటీసులు జారీ చేశాం. 2019కి ముందు బిల్లులు అన్నీ చెల్లించాం. కేవలం రూ.2 రెండు కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులు కూడా ఆయా సంస్థలు టెండర్‌ నిబంధనలు ఫుల్‌ఫిల్‌ చేయకపోవడం వల్లే ఆగాయి. 
- మురళీధర్‌ రెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement