వేమన విగ్రహం వద్ద వీసీ ఆచార్య సూర్యకళావతి
వైవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయంలో వేమన విగ్రహానికి మరింత ప్రాధాన్యత కల్పించామని, దీనిని గుర్తించకుండా రాజకీయం చేయడం తగదని వైస్ చాన్సలర్ ఆచార్య మునగల సూర్యకళావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘విశ్వవిద్యాలయంలో ఎక్కడా కొత్త విగ్రహాలు ఏర్పాటు చేయలేదు. తొలగించనూ లేదు. వేమన విగ్రహాన్ని కొత్తగా నిర్మించిన ప్రధాన ముఖ ద్వారం వద్ద గత నెల 31న ఏర్పాటు చేయడంతో ఖాళీ అయిన స్థానంలో వైవీయూ వ్యవస్థాపకుడు వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేశాం.
ఈ మార్పు వల్ల వేమనకు మరింత ప్రాధాన్యత లభిస్తుంది. ఇదివరకు లోపలికి వస్తే కానీ కనిపించని వేమన విగ్రహం.. ఇప్పుడు ప్రధాన ద్వారం వద్దే అందరికీ బాగా కనిపిస్తుంది. ఈ వాస్తవం కళ్లెదుటే కనిపిస్తున్నా, దీనిని రాజకీయం చేయడం సరికాదు’ అని అన్నారు. ఇదిలా ఉండగా, ఆ పత్రికల్లో సాగిన దుష్ప్రచారంపై విశ్వవిద్యాలయం అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేము ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఆ పత్రికలు తప్పుడు వార్త ప్రచురించాయని తెలిసింది. వేరే ఊళ్లలో ఉంటున్న వారు అదే వాస్తవమని నమ్మే ప్రమాదం ఉంది. అమ్మో.. ఇంత భయంకరంగా, పచ్చిగా, నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతారా?’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment