పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని రిమ్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పుష్పగిరి కంటి ఆస్పత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. తద్వారా రాయలసీమ వాసులకు అత్యాధునిక కంటి వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.50 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి 11.05 గంటలకు రిమ్స్‌కు చేరుకున్నారు.
అక్కడ ఆయనకు జిల్లా కలెక్టర్‌తోపాటు పుష్పగిరి కంటి ఆస్పత్రి చైర్మన్ గోవిందారి, ప్రతినిధులు డాక్టర్ విశాల్ గోవిందారి, మెడికల్ చైర్మన్ డాక్టర్ విశ్వనాథ్, తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం 11.45 గంటలకు రిమ్స్ ఆవరణలో 2.05 ఎకరాల స్థలంలో రూ.20 కోట్లతో నిర్మించిన పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించిన సీఎం.. ఆస్పత్రిలోని రిసెప్షన్, కన్సల్టేషన్, ఆపరేషన్ థియేటర్లు, 150 పడకల బ్లాక్, తదితర విభాగాలను పరిశీలించారు. ఆయా విభాగాల గురించి కంటి ఆస్పత్రి చైర్మన్ సీఎంకు వివరించారు. ఆస్పత్రి చాలా బాగుందని ముఖ్యమంత్రి అభినందించారు. రాయలసీమ ప్రాంత ప్రజలందరికీ నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆస్పత్రి ప్రతినిధులకు సూచించారు.
150 పడకలు.. ఏడు ఆపరేషన్ థియేటర్లు
వైఎస్ జగన్ ప్రభుత్వం.. ప్రైవేటు రంగంలో సైతం వైద్యాన్ని ప్రోత్సహిస్తూ నిరుపేదలకు ఖరీదైన వైద్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. సీఎం ప్రారంభించిన పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్‌స్టిట్యూట్‌లో 150 పడకలతో పాటు ఏడు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ల సౌకర్యం ఉంది. నలుగురు నిపుణులైన కంటి వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటారు. స్థానికంగా నిపుణులైన కంటి వైద్యులు కూడా ఈ ఆస్పత్రిలో సేవలు అందించనున్నారు. రాయలసీమ జిల్లాల్లోని ప్రజల కంటికి సంబంధించిన ప్రాథమిక సమస్యలు మొదలు తీవ్ర స్థాయి సమస్యలకు సైతం ఇక్కడ వైద్య సేవలు అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment