Andhra Pradesh: రాష్ట్ర ప్రయోజనాలే 'పరమావధి' | YS Jagan mohan Reddy directions to YSRCP MPs | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: రాష్ట్ర ప్రయోజనాలే 'పరమావధి'

Published Fri, Nov 22 2024 4:20 AM | Last Updated on Fri, Nov 22 2024 6:04 AM

YS Jagan mohan Reddy directions to YSRCP MPs

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎంపీలు

ఎంపీలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం 

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

పోలవరం ఎత్తు తగ్గింపు వల్ల కలిగే నష్టాన్ని వివరించండి 

45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెండి 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడండి  

రాష్ట్రానికి హక్కుగా దక్కిన ప్రత్యేక హోదాను తక్షణమే కల్పించాలని డిమాండ్‌ చేయండి 

ముస్లింల హక్కులకు విఘాతం కల్పించే వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకించండి 

అవసరమైతే పార్లమెంట్‌ను స్తంభింప చేయండని ఆదేశం 

సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించిన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ 

రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా రాజీ పడకుండా లోక్‌సభ,రాజ్యసభల్లో పోరాటం చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న తరుణంలో.. ఆ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, అన్ని కీలక అంశాలను పార్లమెంటు ఉభయ సభల్లో లేవనెత్తాలని వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ప్రధానంగా రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలన్న నిర్ణయం వల్ల కలిగే నష్టాన్ని సభలో ప్రస్తావించాలని చెప్పారు. ఆ మేరకు పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని, ఇదే అంశంపై ప్రధానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయాలని సూచించారు. 

ప్రాజెక్టు పెండింగ్‌ బిల్లులు, ఆర్‌ అండ్‌ ఆర్‌ నిధులు తక్షణమే విడుదల చేసి ముంపు ప్రాంత వాసులకు న్యాయం చేయాలని కోరాలని చెప్పారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని సూచించారు. ఈ విషయమై ఉభయ సభల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో పాటు ఢిల్లీలో ధర్నా చేయాలన్నారు. 

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయబోమని, రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక సాకారమయ్యేలా మన వంతుగా గట్టి ప్రయత్నం చేయాలని, ఇందులో భాగంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని నిర్దేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వక్ఫ్‌ బిల్లును ఆమోదించకూడదని, దీనిపైనా ఆందోళన చేయాలని ఆదేశించారు. వక్ఫ్‌ బిల్లుతో సెక్యులర్‌ దేశం అన్న దానికి అర్థం లేకుండా చేస్తే.. ముస్లిం మైనారిటీల తరఫున అవసరమైతే పార్లమెంట్‌ను స్తంభింప చేయాలని సూచించారు.  

అక్రమ కేసుల గురించి గట్టిగా మాట్లాడాలి 
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, ఆస్తుల విధ్వంసం, హత్యలు, హత్యా యత్నాలు జరుగుతూనే ఉన్నాయని, వీటన్నింటి గురించి పార్లమెంట్‌లో ప్రస్తావించాలని పార్టీ ఎంపీలకు వైఎస్‌ జగన్‌ సూచించారు. ఇటీవల సోషల్‌ మీడియా పోస్ట్‌లు సాకుగా చూపుతూ యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించి దారుణంగా వేధిస్తుండటం.. పోలీస్‌ కస్టడీలో థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తుండటం యావత్‌ దేశం దృష్టికి తీసుకెళ్లేలా ఉభయ సభల్లో మాట్లాడాలని చెప్పారు. 

సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై వేర్వేరు చోట్ల కేసులు నమోదు చేస్తున్నారని, ఒకరిద్దరిపై ఏకంగా 10–15 కేసులు నమోదు చేయడం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపునకు నిదర్శంగా నిలుస్తోందని.. ఇంత తీవ్రమైన దారుణాలు గతంలో ఎన్నడూ చూడలేదనే విషయాన్ని అన్ని పారీ్టల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. మరోవైపు టీడీపీకి చెందిన సోషల్‌ మీడియా పెడుతున్న దారుణమైన పోస్ట్‌లపై వైఎస్సార్‌సీపీ నాయకులు సాక్ష్యాధారాలతో సహా ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఎక్కడా పోలీసులు స్పందించడం లేదని, కనీసం కేసు కూడా నమోదు చేయడం లేదనే విషయాలను ఎత్తి చూపాలని సూచించారు. 

ఈ విషయాలన్నింటినీ పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాలని వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేశారు. అనంతరం సమావేశ వివరాలను రాజ్యసభ సభ్యుడు పిల్లి సుబాష్‌ చంద్రబోస్‌.. ఎంపీలు తనూజా రాణి, మేడా రఘునాథ రెడ్డి, గొల్ల బాబూరావుతో కలిసి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, చట్ట విరుద్ధమైన అరెస్టుల వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో అన్ని పార్టీల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం మేరకు రాష్ట్రానికి సంబంధించిన కీలకాంశాలన్నింటి గురించి పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement