చంద్రబాబు పాలనలో కంటే సీఎం జగన్ హయాంలోనే ఎక్కువ అభివృద్ధి
బాబు ఐదేళ్లలో వార్షిక సగటు వృద్ధి5.15%
ఈ ఐదేళ్లలో వార్షిక సగటు వృద్ధి 6.20%
సెల్ ఫోన్ నేనే కనిపెట్టా.. ఐటీని నేనే సృష్టించా.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌నూ నేనే కట్టా.. హైదరాబాద్‌లో రింగు రోడ్డునూ నేనే వేశా.. సింధూకు బాడ్మింటన్ ఆడమని నేనే చెప్పా.. అంతెందుకు నా గైడెన్స్ మేరకే సత్య నాదెళ్ల ఇవాళ అంతటివాడయ్యాడు.. తుపాన్లనే ఆపగలిగాను.. సంపద సృష్టికి నేనే బ్రాండ్ అంబాసిడర్..’ ఇలా కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పేదెవరంటే, చంద్రబాబు అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు.
అప్పుడు బాబు హయాంలో, ఇప్పుడు జగన్ హయాంలో దాదాపు ఒకే బడ్జెట్.. అప్పులు అప్పటి కంటే ఇప్పుడే తక్కువ.. అయినప్పటికీ సీఎం జగన్ ఈ ఐదేళ్లలో పేద ప్రజల ఖాతాల్లో వివిధ పథకాల రూపేణ ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. తద్వారా ఆర్థిక చక్రాన్ని పరుగులు పెట్టించారు. అభివృద్ధి విషయంలో కొత్త పుంతలు తొక్కించారు. ఈ ఐదేళ్లలో వార్షిక సగటు వృద్ధి 6.20 శాతానికి పెరగడమే ఇందుకు నిదర్శనం. అన్ని రంగాల్లోనూ స్పష్టమైన అభివృద్ధి కళ్లెదుటే కనిపిస్తోంది. ఇందుకు కేంద్ర గణాంకాలే సాక్ష్యం.
► స్థిర ధరల ప్రకారం గత ఐదేళ్లలో జీఎస్‌డీపీ పెరుగుదల రూ.1,94,063 కోట్లు
► అదే బాబు పాలనలో రూ.1,28,341 కోట్లే
► కోవిడ్ సంక్షోభంలోనూ జగన్ హయాంలోనే భారీగా పెరిగిన సంపద
► స్థిర ధరల ఆధారంగా 2023–24 రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి 7.35 శాతం
► బాబు హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.6.26 లక్షల కోట్లు
► 2023–24లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.8.20 లక్షల కోట్లు
► కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ లెక్కలేఇందుకు నిదర్శనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓ వైపు సంక్షేమాభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ.. మరో వైపు పేదరికాన్ని తగ్గించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కంటే ముందంజలో ఉంది. రాష్ట్ర అభివృద్ధికి, సంపద సృష్టించారనడానికి కొలమానం అ రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలే. ఆర్థిక మందగమనం, కోవిడ్ సంక్షోభాలను సైతం అధిగమించి సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో వరుసగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
కోవిడ్ సంక్షోభం లేనప్పటికీ గత చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సగటు వార్షిక వృద్ధి రేటు 5.15 శాతం నమోదు కాగా, అదే సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో సగటు వార్షిక వృద్ధి 6.20 శాతం నమోదైంది. పదే పదే సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్లి ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు.. తన ఐదేళ్ల పాలనలో కోవిడ్ లాంటి సంక్షోభం లేనప్పటికీ సంపద సృష్టించడంలో ఎందుకు వెనుకబడ్డారో చెప్పాలి. ప్రజలు ఏది చెబితే అదే నమ్ముతారనుకోవడం ఎల్లవేళలా సాగదనే విషయం చంద్రబాబు మరిచిపోతున్నారు.
తనకొక్కడికే సంపద సృష్టించడం వచ్చనే ధోరణిలో చంద్రబాబు ఇస్తున్న బిల్డప్ అంతా తుస్ అని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ద్వారా వెల్లడైంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నమోదులో టాప్ పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరవ స్థానంలో ఉందని స్పష్టమైంది. ఈ గణాంకాలన్నీ 2011–12 సంవత్సరం స్థిర ధరల ఆధారంగా కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ గణాంకాలన్నీ పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉన్నాయి.
కోవిడ్‌లోనూ రయ్.. రయ్..
చంద్రబాబు ఐదేళ్ల పాలనలో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.1,28,341 కోట్లు పెరిగింది. అంటే మొత్తం ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 25.74 శాతం పెరిగింది. అంటే సగటు వార్షిక వృద్ధి 5.15 శాతంగా నమోదైంది. అదే సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.1,94,063 కోట్ల మేర పెరిగింది. అంటే ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల 30.95 శాతం. వార్షిక సగటు వృద్ధి 6.20 శాతంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే సంపద సృష్టించడంలో, రాష్ట్ర అభివృద్ధి విషయంలో గత చంద్రబాబు పాలన కన్నా సీఎం వైఎస్ జగన్ పాలన ఎంతో మెరుగ్గా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఆర్థిక మందగమనం, కోవిడ్ సంక్షోభంతో రాష్ట్ర సొంత ఆదాయంతో పాటు కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా రూపంలో రాబడి తగ్గిపోయినప్పటికీ రాష్టంలో ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోకుండా కొనసాగించే చర్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్నారు. మరో పక్క కోవిడ్‌లోనూ పేద, మధ్య తరగతి ప్రజలకు నేరుగా నగదు బదిలీ పథకాలను అమలు చేశారు. ఈ చర్యలతో రాష్ట్ర ఆర్థిక చక్రం ఆగిపోకుండా నిలదొక్కుకుంది. అందువల్లే జగన్ పాలనలో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల ఎక్కువగా నమోదైంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి 7.35 శాతం వృద్ధి నమోదైందని కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment