సాక్షి, విజయవాడ: వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలను చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేసిందని మండిపడ్డారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అలాగే, వరద బాధితులను ఆదుకోవడంలో కూడా కూటమి సర్కార్ విఫలమైందన్నారు. వర్షాలపై ప్రభుత్వం సరైన ప్లాన్ చేసి ఉంటే ఇంత తీవ్ర పరిస్థితులు ఉండేవి కాదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ తీరుపై ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం వైఎస్ జగన్ పర్యటించారు. విజయవాడలోని సింగ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో బాధితులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్బంగా నడుము లోతు ఉన్న వరద నీటిలో బాధితులను కలుస్తూ.. వారికి భరోసా ఇచ్చారు. అనంతరం, వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ..‘విజయవాడలో దయనీయ పరిస్థితులు ఉన్నాయి. కనీసం తినడానికి తిండి కూడా లేదు. బాధితులకు సరిపడే బోట్లు ప్రభుత్వం ఇవ్వలేదు. చాలీచాలని విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం దారుణం. బాధితులకు రిలీఫ్ క్యాంప్‌లు కూడా లేవు. ఆరు రిలీఫ్ క్యాంపులు మాత్రమే ఉన్నాయి. లక్షల మంది బాధితులకు ఆరు రిలీఫ్ క్యాంపులు ఎలా సరిపోతాయి?. ఒక్కరికి కూడా ప్రభుత్వం పైసా సాయం చేయలేదు. తాగడానికి నీరు లేదు. తినేందుకు తిండి కూడా లేదు. బాధితులు ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. రిలీఫ్ క్యాంపులు ఎక్కడ ఉన్నాయో కూడా వారికి తెలియదు. బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. వారి ఆవేదన చంద్రబాబు ప్రభుత్వానికి కనిపించడం లేదా?.
ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించలేదు. గతంలో ఇంతకంటే ఎక్కువగా భారీ వర్షాలు కురిశాయి. కానీ మనుషులు చనిపోయిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. వాయుగుండం, వర్షాలు వస్తున్నాయని ఆగస్టు 28వ తేదీనే వాతావరణ శాఖ హెచ్చరించింది. కానీ, హెచ్చరికను కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇవి ప్రభుత్వ తప్పిదం వల్ల వచ్చిన వరదలు. ప్రభుత్వ అజాగ్రత్త వల్లే వరదలు వచ్చాయి. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వ నిర్లక్ష్యంపై చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. బాధితులను ఆదుకుని వారిని సౌకర్యాలు అందించాలి’ అని డిమాండ్ చేశారు.
11 లక్షల క్యూసెక్కుల వరద రావడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇదే స్థాయిలో వరదలు వచ్చాయి. వైఎస్సార్‌సీపీ నేతలంతా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గతంలో వాలంటీర్లంతా సహాయక చర్యలు అందించేవారు. గతంలో ప్రతీ కుటుంబానికీ ఆర్థిక సహాయం అందించాం. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలతో గడపగడపకూ సహాయం చేశాం. రిలీఫ్ క్యాంపులను ముందే ఏర్పాటు చేసే వాళ్లం. ఇప్పుడు బాధితులకు ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. చంద్రబాబు ప్రభుత్వం.. వరదల్లో చిక్కుకున్న ప్రజలను పట్టించుకున్న దాఖలాలే కనిపించడం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment