
సాక్షి, అమరావతి: ఇనాం భూముల సమస్యను పరిష్కరించి లక్షలాది ఎకరాల భూములపై నిషేధం తొలగించిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఈనాడు తన అక్కసు వెళ్లగక్కింది. చంద్రబాబు అసమర్ధతను కప్పిపుచ్చుతూ తప్పుడు కథనాన్ని వండి వార్చింది. పచ్చకళ్లతో నిజాలు చూడకుండా వివాదాస్పద భూములకు హక్కులు కల్పించిన వైఎస్ జగన్‌ను కుంభకర్ణుడి వారసుడంటూ అసత్యాలు వల్లెవేస్తూ.. భూముల సమస్యలను పరిష్కరించలేక రైతులను నట్టేట ముంచిన చంద్రబాబును మాత్రం పేదల పెన్నిధి అంటూ ఆకాశానికెత్తారు.
అసలు గ్రామ సర్వీస్ ఇనాం భూముల సమస్యను పరిష్కరించలేక చేతులెత్తేసింది చంద్రబాబు కాదా? ఆ విషయం రామోజీకి, ఈనాడుకు తెలియదా? ఓట్ల కోసం ఎన్నికలకు రెండు నెలల ముందు పనికిరాని ఆర్డినెన్స్ చేసి రైతులను ఇబ్బందుల్లోకి నెట్టిన చంద్రబాబు అసమర్ధత ఆ పత్రికకు కనిపించలేదా? ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత కల్పించలేకపోయిన బాబును వదిలి ఆ సమస్యను పరిష్కరించిన వైఎస్ జగన్‌ను ఆడిపోసుకోవడం, కుంభకర్ణుడి వారసుడు, సైంధవుడంటూ ఇష్టానుసారం రాయడం దుష్టచతుష్టయంలో ఒకరైన రామోజీకే చెల్లింది.
ఆర్డినెన్స్ పేరిట బాబు డ్రామాలు
1956 ఏపీ (ఆంధ్ర ప్రాంత) ఇనామ్స్ (ఎబాలిషన్ అండ్ కన్వర్షన్ ఇన్ టు రైత్వారీ) చట్టం ప్రకారం రైత్వారీ భూములు, అవి వ్యక్తిగతంగా ఉంటే రైతులు, వారి వారసులకు.. లేదంటే కౌలుదారులకు హక్కులను గుర్తించి రైత్వారీ పట్టాలు ఇవ్వవచ్చు. దేవదాయ శాఖ భూములైతే దేవాలయం పేరిట రైత్వారీ పట్టాలు మంజూరు చేయవచ్చు.
ఆ చట్టం దుర్వినియోగం అవుతుండడంతో పాటు అందులో లోపాలు ఉన్నాయని గుర్తించారు. అలాగే కోర్టు ఆదేశాలతో 2013లో అప్పటి ప్రభుత్వం యాక్ట్–16 ఆఫ్ 2013 చట్టం చేసింది. దీని ప్రకారం దేవాలయ భూములను వ్యక్తులకు, దేవాలయానికి సేవలు చేసే వారికి ఇస్తే అవి రద్దయ్యాయి. ఆ భూముల క్రమవిక్రయాలు.. వారికి సంబంధించిన రైత్వారీ పట్టాలు రద్దు చేశారు.
కులవృత్తుల వారికి కేటాయించిన ఇనాం భూముల రైత్వారీ పట్టాలు కూడా పొరపాటున రద్దయ్యాయి. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ సమస్యను పరిష్కరించలేకపోయారు. 2019లో ఎన్నికలకు రెండు నెలల ముందు ఆ సమస్యను పరిష్కరిస్తున్నట్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేతులు దులుపుకున్నారు.
1.79 లక్షల ఎకరాల భూములపై ఆంక్షల తొలగింపు
వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుచూపుతో దేవాలయ భూములు, చారిటబుల్ భూములు, ఇనాం భూములు, గ్రామ సర్వీసు ఈనాం భూములను విడదీసింది. ప్రస్తుత చట్టాల ప్రకారం గ్రామ సర్వీసు ఇనాం భూములకు, గతంలో మంజూరు చేసిన రైత్వారీ పట్టాలకు జీఓ ఎంఎస్ నెం–310 ద్వారా గత సంవత్సరం చట్టబద్ధత కల్పించారు. దేవదాయ భూములకు, గ్రామ సర్వీసు ఇనాం భూములకు వ్యత్యాసాన్ని గుర్తించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమవగా దాన్ని ఈ ప్రభుత్వం సరిచేసింది.
దీనివల్ల 1.79 లక్షల ఎకరాల సర్వీసు ఇనాం భూములపై ఆంక్షలు తొలగాయి. అంతేకాదు దేవదాయ ఇనాం భూములు, ఇన్‌స్టిట్యూషనల్ ఇనాం భూములు, చారిటబుల్ ఇనాం భూములు, గ్రామ సర్వీసు ఇనాం భూముల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా వివరించింది. దీనివల్ల సంవత్సరాలుగా వివాదంలో ఉన్న భూముల సమస్యలు పరిష్కారమయ్యాయి. ఇనాం భూములే కాదు చుక్కల భూములు, షరతుల గల పట్టా భూముల, ఇతర అనేక రకాల భూముల సమస్యను వైఎస్ జగన్ ప్రభుత్వం చాకచక్యంగా పరిష్కరించింది. 3 లక్షల ఎకరాలకు పైగా భూములను 22ఏ జాబితా నుంచి తొలగించి సంబంధిత రైతులకు మేలు చేకూర్చింది.
అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడంతో 27 లక్షల ఎకరాలకు చెందిన రైతులు లబ్ధి పొందారు. కళ్ల నిండా పచ్చ విషం నింపుకున్న రామోజీరావుకు, ఆయన పత్రికకు ఇవేమీ కనపడడలేదు. అందుకే పచ్చపాతంతో అసత్య కథనాలు అచ్చేసింది. పేదల పక్షపాతిని కాదని.. సైంధవుల పక్షపాతినని, కుంభకర్ణుడికి అసలు సిసలు వారసుడినని రామోజీరావు మరోసారి ఈ కథనం ద్వారా నిరూపించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment