AP YS Jagan: CM Speech At Jagananna Sampoorna Gruha Hakku Launching Tanuku - Sakshi
Sakshi News home page

మంచి చేస్తుంటే ఎందుకంత కడుపుమంట: సీఎం జగన్‌

Published Tue, Dec 21 2021 1:45 PM | Last Updated on Tue, Dec 21 2021 8:21 PM

YS Jagan Speech AT Jagananna Sampoorna Gruha Hakku Launching Tanuku - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: పేదవాడికి మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేని వారిని నిలదీయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నామ మాత్రపు ధరకు రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తుంటే మీకెందుకు కడుపుమంట అని అడగండి. మా ఇళ్లను ఓటీఎస్‌ లేకుండా మార్కెట్‌ రేట్ల కొంటారా అని అడగండి. మా అన్న ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్‌చేస్తుంటే మీకెందుకు కడుపుమంట అని చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణను ప్రశ్నించాలి’’ అని సీఎం అన్నారు.

రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు లేకపోతే మీరు కొంటారా? అని వారిని ప్రశ్నించాలన్నారు. ‘‘మీ ఆస్తులైతే రిజిస్ట్రేషన్లు అయి ఉంటాయి. పేదవాళ్లకైతే రిజిస్ట్రేషన్లు అవ్వకూడాదా? మంచి చేస్తుంటే చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ జీర్ణించుకోలేపోతున్నారని’’ అని ముఖ్యమంత్రి జగన్‌ మండిపడ్డారు. వడ్డీ మాఫీ చేయమని ప్రతిపాదనలు ఐదు సార్లు పంపితే.. ఏదో ఒక వంకతో తిప్పి వెనక్కి పంపిన పెద్ద మనిషి చంద్రబాబు. రుణమాఫీ కాదు కాదా.. వడ్డీ మాఫీ చేయని పెద్ద మనుషులు వీరు’’ అని సీఎం దుయ్యబట్టారు.

ఇల్లు అంటే ఇటుకలు, స్టీలుతో కట్టిన కట్టడం కాదని.. సుదీర్ఘకాలం పడిన కష్టానికి  ప్రతి రూపం ఇల్లు అని  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 50 లక్షల మంది కుటుంబాలకు లబ్ధిచేకూరే మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టామన్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సొంతింటి కల నెరవేస్తున్నామన్నారు. ఓటీఎస్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఓటీఎస్‌ కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చామన్నారు.

‘‘ఇప్పటికే 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంటిపై సర్వహక్కులు కల్పనకే జగనన్న సంపూర్ణ గృహ పథకం. రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షల మందికి సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్‌. ఈ పథకం కింద దాదాపు రూ.10 వేల కోట్ల రుణమాఫీ. రూ.6 వేల కోట్ల రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ ఛార్జీల మినహాయింపు. 52 లక్షల మందికి ఇచ్చే ఆస్తి విలువ రూ.లక్షా 58 వేల కోట్లు. సొంతిల్లు ఉంటే అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని’’ సీఎం అన్నారు.

తణకులో ఇంటి మార్కెట్‌ విలువ రూ.30  లక్షల వరకు ఉంది. గతంలో కేవలం నివసించే హక్కు మాత్రమే ఉన్న లబ్ధిదారులను ఇవాళ్టి నుంచి పూర్తిస్థాయి యజమానులుగా మారుస్తున్నాం. కుటుంబ అవసరాల కోసం బ్యాంకుల్లోనూ తాకట్టు పెట్టుకోవచ్చు. ఈ పథకం కింద దాదాపు రూ.10వేల కోట్ల రుణమాఫీతో పాటు రూ.6వేల కోట్ల రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ ఛార్జీల మినహాయింపుతో దాదాపు రూ.16వేల కోట్ల మేర లబ్ధి చేకూరుతుందన్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement