సొంత అన్న టార్గెట్‌గా షర్మిల అడుగులు
వైఎస్సార్ జీవించి ఉన్నప్పుడే కుటుంబ ఆస్తులన్నీ పంపకం
చెల్లెలిపై ప్రేమాభిమానాలతో తన సొంత ఆస్తుల్లోనూ వాటా ఇస్తానన్న జగన్
తండ్రి మరణించిన పదేళ్ల తరవాత... ఈ మేరకు 2019లో ఎంఓయూ
కేసులన్నీ తొలగిపోయాక ఆ ఆస్తుల్ని ఇస్తానని ఎంఓయూలో స్పష్టీకరణ
దాంట్లో భాగంగా సరస్వతీ పవర్‌లో మిగిలిన 51 శాతం వాటా కూడా
తల్లి విజయమ్మ పేరిటే తాత్కాలికంగా గిఫ్ట్ డీడ్ చేస్తూ జగన్ దంపతుల సంతకాలు
కానీ గిఫ్ట్ డీడ్‌ను దుర్వినియోగం చేసిన షర్మిల.. తల్లి పేరిట షేర్లుగా మార్పు
ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు జగన్ వద్దే ఉన్నాయని తెలిసీ.. అవి పోయాయని అబద్ధాలు
షేర్ ట్రాన్స్‌ఫర్ ఫారాలు గానీ, జగన్ సంతకం గానీ లేకుండానే షేర్లుగా మార్పు
కనీసం వైఎస్ జగన్‌కు సమాచారం కూడా ఇవ్వకుండా షర్మిల చట్టవిరుద్ధ చర్యలు
సొంత అన్న చట్టపరంగా ఇబ్బందులు పడతారని తెలిసి కూడా కుయుక్తులు
న్యాయపరంగా జగన్‌ను ఇబ్బంది పెట్టాలనే బాబు కుట్రలో క్రియాశీలక పాత్ర
ఇది తెలిశాక.. ఆ బదిలీ చట్టవిరుద్ధమంటూ.. ఆపాలంటూ చెల్లెలికి జగన్ లేఖ
షర్మిల ససేమిరా అనడంతో న్యాయనిపుణుల అభిప్రాయాన్ని తీసుకున్న జగన్
ఇది చట్ట విరుద్ధం కనుక షేర్ల బదిలీని ఆపకుంటే ఇబ్బందులొస్తాయన్న నిపుణులు
తప్పనిసరి పరిస్థితుల్లో.. చట్ట విరుద్ధ బదిలీని ఆపాలంటూ ఎన్‌సీఎల్‌టీకి జగన్
దీనిపై ఎల్లో మీడియాలో వికృత కథనాలు.. బాబు కుట్రకు షర్మిల వంత
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా చంద్రబాబు వేస్తున్న ఎత్తుగడల్లో షర్మిల పూర్తిగా కూరుకుపోయారు. జగన్ వ్యతిరేకులందరితోనూ చేతులు కలిపి ఇటీవల ఎన్నికల్లో దారుణమైన అసత్యారోపణలు చేసిన షర్మిల.. ఇప్పుడు మరింత దిగజారిపోతున్నారు. అక్రమ కేసులెదుర్కొంటున్న జగన్‌ను న్యాయపరంగా ఇబ్బంది పెట్టాలన్న బాబు కుట్రలో పూర్తిగా లీనమైపోయారు.
గత్యంతరం లేక షర్మిలతో వైఎస్ జగన్ రాజీకి వచ్చారంటూ ఎల్లో మీడియా ఇస్తున్న కథనాలు... తల్లికి, చెల్లెలికి ఆస్తి ఇవ్వకుండా జగన్ కోర్టు మెట్లు ఎక్కారంటూ జాతీయ మీడియాలో వస్తున్న అర్థసత్యాలు.. జగన్ లక్ష్యంగా టీడీపీ సోషల్ మీడియా కారుకూతలు... ఇవన్నీ ఈ కుట్రలో భాగమే.
అసలు వైఎస్ జగన్ ఆస్తులతో షర్మిలకు సంబంధమేంటి? కుటుంబ ఆస్తులన్నిటినీ తమ తండ్రి వైఎస్సార్ జీవించి ఉన్నపుడే పంపకాలు చేసేసినా.. చెల్లెలి పట్ల ప్రేమాభిమానాలతో తను సొంతంగా సంపాదించుకున్న ఆస్తుల్లోనూ వాటా ఇస్తానన్న జగన్‌ను షర్మిల ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? షర్మిల ఎలాంటి కుట్రల్లో భాగమవుతున్నారు? భావోద్వేగాలతో తల్లిని ముందుపెట్టి షర్మిల ఎలాంటి ప్రమాదకర క్రీడ ఆడుతున్నారు? ఒకసారి చూద్దాం.
షర్మిలకు పాతికేళ్ల కిందటే వివాహమైంది. ఆమెకు సొంత ఆస్తులూ ఉన్నాయి. పైపెచ్చు వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు తాను సంపాదించిన ఆస్తులను కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి తను జీవించి ఉన్నçప్పుడే కుటుంబీకులకు పంపకాలు చేశారు. దీన్లో భాగంగా షర్మిలకు పలు భూములు, పవర్ ప్రాజెక్టులతో సహా విలువైన ఆస్తులెన్నో దక్కాయి. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి వివాదాలూ లేవు. అందుకే వైఎస్సార్ మరణించాక ఆస్తులకు సంబంధించి ఆయన కుటుంబీకుల మధ్య
ఎలాంటి వివాదాస్పద అంశాలూ తలెత్తలేదు.
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌కు తొలి నుంచీ వ్యాపార రంగంపై ఆసక్తి. స్వయంకృషితో కొన్ని వ్యాపారాలు ప్రారంభించి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు. మరికొన్ని వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెట్టారు. ఇవన్నీ ఆయన సొంతంగా చేసినవి కావటంతో వీటికి, కుటుంబ వారసత్వానికి ఎలాంటి సంబంధమూ లేదన్నది స్పష్టం. అందుకే వైఎస్సార్ జీవించి ఉన్నపుడు సైతం ఈ ఆస్తులు వైఎస్ జగన్ పేరిటే ఉన్నాయి. ఒక్కో మెట్టుగా ఆ సంస్థలను అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు జగన్.
ఇక వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో మరణించాక జగన్‌ను తమ దారిలోకి తెచ్చుకోవటానికి కాంగ్రెస్ అధిష్టానం సామ దాన భేదోపాయాలకు దిగటం... అయినా లొంగకపోవటంతో చంద్రబాబుతో చేతులు కలిపి దండోపాయం పన్నటం... జగన్ వ్యాపారాల్లోకి వచ్చిన పెట్టుబడులన్నీ అక్రమమంటూ కేసులు బనాయించడం... ఇవన్నీ తెలుగు ప్రజలకు తెలిసినవే. కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవి కావటంతో జగన్ వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారే కానీ లొంగలేదు. కాంగ్రెస్– టీడీపీ కుట్రలో భాగంగా జైలు పాలైన వైఎస్ జగన్... 2019లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఇవీ... చెల్లెలి పట్ల ప్రేమాభిమానాలంటే
2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తోడబుట్టిన చెల్లెలికి కూడా ఆర్థికంగా ఏదైనా చేయాలని సంకల్పించారు జగన్. ఆమెపై ఉన్న ప్రేమాభిమానాలతో తాను సొంతంగా ఆరంభించి అభివృద్ధి చేసుకున్న వ్యాపారాల్లో, తాను సంపాదించిన ఆస్తుల్లో కొంత వాటా ఇస్తానని చెప్పారు. తాను ప్రారంభించిన సాక్షి, భారతీ సిమెంట్ లాంటి విలువైన వ్యాపారాల్లో సైతం... తన వాటాలో 40 శాతాన్ని చెల్లెలికివ్వాలని జగన్ సంకల్పించారు. అదీ... కుటుంబంపై జగన్‌కున్న ప్రేమ. చెల్లెలంటే ఉన్న అభిమానం.
నిజానికి కాంగ్రెస్ అధిష్టానం కుట్రతో పెట్టిన కేసుల కారణంగా జగన్‌కు చెందిన ఆస్తులు ఇప్పటికీ చాలావరకూ ఈడీ, సీబీఐ జప్తుల్లో ఉన్నాయి. అటాచ్‌మెంట్లో ఉన్న ఆస్తులైనా, వాటిలో వాటాలైనా బదిలీ చేయటం, విక్రయించటం నిషేధం, చట్టవిరుద్ధం. అందుకే ఆయన తన ఆస్తుల్లో చెల్లెలికి ఇవ్వాలనుకుంటున్న వాటాలన్నిటినీ కోర్టు కేసులు పూర్తిగా తొలగిపోయాక బదిలీ చేస్తానని స్పష్టంగా చెప్పారు. మాటలతో ఊరుకోకుండా... కోర్టు కేసులు తొలగిపోయాక భవిష్యత్తులో తాను ఏ ఆస్తుల్ని షర్మిలకు ఇవ్వాలనుకుంటున్నదీ పొందుపరుస్తూ ఒక అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) తయారు చేశారు.
తన చెల్లెలు కనక ఆమె పట్ల ఉన్న ప్రేమాభిమానాలతో ఈ ఆస్తుల్ని ఇవ్వాలని భావిస్తున్నట్లు ఎంఓయూలో స్పష్టంగా పేర్కొన్నారు. అక్రమ కేసులన్నీ తొలగిపోయాకే ఆస్తుల బదిలీ ఉంటుందని కూడా ఎంఓయూలో స్పష్టం చేశారు. వాస్తవానికి కుటుంబ ఆస్తులను వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉండగానే, ఆయనే పంపకాలు చేశారు. ఆయన మరణించిన పదేళ్ల తరవాత... జగన్ తను సొంతంగా సంపాదించుకున్న ఆస్తుల్లో సైతం చెల్లెలికి వాటా ఇవ్వాలనుకున్నారు. అదీ ఆమెపై ఉన్న ప్రేమాభిమానమంటే. ఇదీ... వాస్తవం.
న్యాయపరంగా ఇబ్బంది పెట్టేందుకు సరస్వతీ పవర్ షేర్ల అక్రమ బదిలీ!
వైఎస్ జగన్ తన చెల్లెలి పట్ల ప్రేమాభిమానాలతో ఇవ్వాలని సంకల్పించిన ఆస్తుల్లో సరస్వతీ పవర్ కూడా ఉంది. దీన్లో వైఎస్ జగన్ దంపతులతో పాటు వైఎస్ విజయమ్మ కూడా వాటాదారు. యాజమాన్య హక్కులు మారనంతవరకూ వాటాదార్ల మధ్య షేర్ల బదిలీ ఆమోదయోగ్యమేనన్న సాధారణ సూత్రం మేరకు అప్పటికే విజయమ్మ పేరిట 49 శాతం షేర్లను వైఎస్ జగన్ బదలాయించారు. వీటిని కేసులన్నీ తొలగిపోయాక తల్లి నుంచి షర్మిలకు బదలాయించవచ్చన్నది జగన్ ఉద్దేశం. అయితే మిగిలిన వాటా కూడా తనకివ్వాలని షర్మిల కోరటంతో... అది న్యాయవిరుద్ధం కనక కేసులన్నీ తొలగిపోయాక చేస్తానని జగన్ స్పష్టంచేశారు.
అలా మాట చెప్పి ఊరుకోకుండా... చెల్లెలికి మరింత భరోసా కలిగేలా... తన నిబద్ధతను చాటుకుంటూ తల్లిని మధ్యవర్తిగా పెట్టి తల్లికి ఆ షేర్లను గిఫ్ట్‌డీడ్ రాశారు. ఆస్తుల బదిలీ చట్టవిరుద్ధం కనక గిఫ్ట్‌డీడ్‌ను పూర్తి చేయలేదు. అందుకే న్యాయ ప్రక్రియకు లోబడి కేసులన్నీ తొలగిపోయాకే షేర్లు ఇస్తానంటూ... ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు తనవద్దే ఉంచుకున్నారు. కేసులన్నీ తొలగిపోయాక, తాను షేర్ సర్టిఫికెట్లు ఇచ్చాక... తల్లి ఆ గిఫ్ట్‌డీడ్‌ను షేర్లుగా మార్చుకుని షర్మిలకు బదలాయించాలన్నది వారి ఒప్పందం.
అందుకు తల్లి విజయమ్మ, షర్మిల అంతా సరేనన్నారు. ఇదిగో... ఇక్కడే కూటమి కుట్రను షర్మిల అమలు చేశారు. ఈడీ జప్తులో ఉన్న ఆస్తుల బదిలీ నిషిద్ధం కనక అలాంటివేమైనా చేస్తే జగన్ న్యాయపరంగా ఇబ్బంది పడతారు. సాంకేతికంగా ఆయన కోర్టు నిబంధనలను ఉల్లంఘించినవారవుతారు. ఈ విషయం షర్మిలకు స్పష్టంగా తెలుసు. తెలిసి కూడా... ఆయన్ను ఇబ్బంది పెట్టాలనే చంద్రబాబు కూటమి అజెండా మేరకు... తల్లి పేరిట ఉన్న గిఫ్ట్ డీడ్‌ను సోదరుడికి తెలియకుండా దుర్వినియోగం చేశారు.
షేర్ ట్రాన్స్‌ఫర్ ఫారాలు గానీ ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు గానీ.. కనీసం వైఎస్ జగన్ సంతకం గానీ లేకుండానే ఆ గిఫ్ట్ డీడ్‌ను తల్లి పేరిట షేర్లుగా మార్పించేశారు. అలా మార్చేముందు కనీసం షేర్‌హోల్డర్లను సంప్రదించాలన్న నిబంధనకు కూడా నీళ్లొదిలేశారు. వైఎస్ జగన్‌కు కనీసం సమాచారమూ ఇవ్వలేదు. మార్చడానికి షేర్ సర్టిఫికెట్లు అవసరమైనా... అవి పోయాయంటూ ఉద్దేశపూర్వకంగా అబద్ధాలకు దిగారు. జగన్ సంతకం లేకుండానే... గోప్యంగా వ్యవహారం నడిపించేశారు. ఇదండీ... జరిగిన కథ!
గోప్యత పాటించటంలో అర్థమేంటి?
మరీ ఇంతలా దిగజారిపోయి... రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి మరీ సొంత సోదరుడిపై కుట్రలకు దిగుతున్న చెల్లెలి వ్యవహారాన్ని ఎలా చూడాలి? ఆస్తుల బదలాయింపు వల్ల తన సోదరుడు న్యాయపరంగా ఇబ్బంది పడతాడని తెలిసి కూడా... గిఫ్ట్ డీడ్‌ను షేర్లుగా మార్చుకుని దుర్వినియోగం చేశారంటే ఏమనాలి? దీనిపై జగన్‌కు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా గోప్యత పాటించటంలో అర్థమేంటి?
ఆడిటర్ల తనిఖీలో వెల్లడి...
అదృష్టవశాత్తూ జగన్ సంస్థల ఆడిటర్లు రొటీన్‌గా కంపెనీలను చెక్ చేస్తున్నపుడు ఈ గిఫ్ట్ డీడ్‌ను మార్చుకున్న వ్యవహారం కాస్తా బయటపడింది. వాళ్లు అవాక్కై జగన్‌కు విషయం చెప్పారు. దీంతో జగన్ వెంటనే న్యాయ నిపుణులను సంప్రదించారు. ఇలా చేయవచ్చా? అని అడిగారు. సరస్వతీ పవర్ ఆస్తుల బదలాయింపుపై హైకోర్టు స్టే కూడా ఉన్నందున వాటి బదిలీ చట్టవిరుద్ధమని, దీన్ని తక్షణం నిలిపేయాల్సిందేనని వారు సూచించారు. దీంతో వారి సూచనల మేరకు తక్షణం ఈ గిఫ్ట్‌డీడ్ ఎగ్జిక్యూషన్‌ను నిలిపేయాలంటూ షర్మిలకు జగన్ లేఖ రాశారు.
చట్టవిరుద్ధమన్న అంశాన్ని షర్మిల ఏమాత్రం పట్టించుకోకుండా... ఈ ఆస్తుల పంపకానికి సంబంధించి తండ్రి జీవించి ఉన్నపుడే చెప్పారంటూ పొంతన లేని సమాధానమిచ్చారు. పరోక్షంగా... జగన్‌ను న్యాయపరంగా ఇబ్బందిపెట్టాలన్న కూటమి కుట్రకు వంత పాడారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో... ఈ చట్టవిరుద్ధ బదిలీని నిలుపుదల చేయాలంటూ వైఎస్ జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఇదీ జరిగింది.
అప్పటికే నగదుగా రూ.200 కోట్లు
2009లో వైఎస్సార్ మరణించాక 2019లో ఎంఓయూ చేసేవరకూ... అంటే పదేళ్ల వ్యవధిలో షర్మిలకు తల్లి ద్వారా, తాను సొంతంగా దాదాపు రూ.200 కోట్లను అందజేశారు జగన్. ఈ విషయాన్ని షర్మిల తన ఎన్నికల అఫిడవిట్లోనే పేర్కొన్నారు. అన్న నుంచి తీసుకున్నది అప్పుగా చూపించారామె. జగన్ తాను చెల్లెలికి ఇవ్వాలనుకుంటున్న ఆస్తులకు ఈ రూ.200 కోట్లు అదనం.
ప్రత్యర్థులతో చేతులు కలిపి మరీ..
చెల్లెలి పట్ల అభిమానంతో జగన్ తన సొంత ఆస్తులు భవిష్యత్తులో ఆమెకు సంక్రమించేలా అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసినప్పటికీ షర్మిల మాత్రం జగన్ సదుద్దేశాలకు భిన్నంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ఆయన మనసును గాయపరిచే రకరకాల చర్యలకు దిగారు. చంద్రబాబు కూటమి స్కెచ్‌లో భాగంగా మొదట తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల... అక్కడ ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండానే దుకాణం సర్దేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి... రాజకీయంగా అణగదొక్కటానికి ఆయన కుటుంబాన్ని నానా ఇబ్బందులూ పెట్టిన కాంగ్రెస్ పార్టీలోనే తన పార్టీని విలీనం చేసేశారు. అంతేకాదు! ఆ విషయంలో కేసులు వేసి మరీ కాంగ్రెస్‌కు సహకరించిన చంద్రబాబు నాయుడి పంచన కూడా చేరిపోయారు. చివరికి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుని... చంద్రబాబుతో అంటకాగుతూ సొంత అన్నను రకరకాల అసత్యారోపణలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు.
తన సోదరుడి పార్టీకి వ్యతిరేకంగా తల్లి చేత ఓ వీడియోలో మాట్లాడించి... ఎన్నికల ప్రచారం ముగియటానికి రెండు గంటల ముందు మోసపూరితంగా దాన్ని విడుదల చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్‌ను దెబ్బతీసి చంద్రబాబును గెలిపించడానికి శాయశక్తులా ప్రయత్నించారు.
ఇంకా ఎంఓయూకు కట్టుబడి ఉండాలా?
అసలు చెల్లెలికి జగన్ తన సొంత ఆస్తుల్లో వాటా ఎందుకు ఇస్తానన్నారు? ఆమెపై ఉన్న ప్రేమాభిమానాలతోనే కదా? పైపెచ్చు మాటలతో సరిపెట్టకుండా తాను ఇస్తానన్న ఆస్తుల వివరాలతో ఒక ఎంవోయూను కూడా రూపొందించారాయన. ఆ ఆస్తులకు సంబంధించి కేసులున్నాయి కనక... అవన్నీ తొలగిపోయాకే బదిలీ చేస్తానని అదే ఎంఓయూలో స్పష్టంగా పేర్కొన్నారు.
మరి అలాంటి అన్నను ఇబ్బంది పెట్టడానికి షర్మిల ఇన్ని రకాల కుయుక్తులకు దిగుతుంటే ఏమనుకోవాలి? చివరకు ఆ ఎంఓయూను కూడా ఉల్లంఘిస్తూ తల్లి పేరిట ఉన్న గిఫ్ట్‌డీడ్‌ను షేర్లుగా మార్చుకున్నారంటే ఆమెకు ఎంఓయూ పట్ల, చట్టం పట్ల గౌరవం లేదనేగా అర్థం. సొంత అన్నను ఇబ్బంది పెట్టడమే ఏకైక లక్ష్యంగా సాగుతున్నారని తెలియటం లేదా? మరి ఇంకా ఆ ఎంఓయూకు కట్టుబడి ఉండాల్సిన అవసరం జగన్‌కు ఉందా? ఇదిగో... ఇదే విషయాల్ని పేర్కొంటూ గత నెలలో సోదరికి లేఖ రాశారు జగన్.
‘నాన్న ఉండగానే మన మధ్య ఆస్తుల పంపకాలు పూర్తయ్యాయి. ఆ తర్వాత నా కృషితో కొన్ని వ్యాపారాలు ప్రారంభించాను. ఆస్తులు సంపాదించాను. వీటికి వారసత్వంతో సంబంధం లేదు. అయినా కేసులన్నీ పూర్తికాగానే ఆ మేరకు వాటా ఇస్తానన్నాను’ అని చెల్లితో తన అనుబంధాలను గుర్తు చేసుకుంటూ ఆగస్టు 27వ తేదీన వైఎస్ జగన్.. షర్మిలకు రాసిన లేఖ.
మన మధ్య ఆస్తుల పంపకం నాన్న ఉండగానే పూర్తయింది. అయినా 2019లో.. అప్పటికి నాన్న చనిపోయి 10 ఏళ్లు, నీ వివాహం జరిగి∙20 ఏళ్లయింది. అప్పటికీ చెల్లివనే ప్రేమ, మమకారంతో నేను సంపాదించిన ఆస్తుల్లో కూడా వాటా ఇద్దామనుకున్నా. ఆ మేరకు ఎంవోయూ కూడా చేశాను’ అని వాస్తవాలు వివరిస్తూ గత నెల 17న జగన్.. షర్మిలకు రాసిన లేఖ.
షేర్ల బదిలీ చట్ట విరుద్ధం కనక దాన్ని నిలిపేయాలన్నారు. దానికి షర్మిల సమాధానమిస్తూ... తండ్రి బతికి ఉన్నప్పుడే ఈ మేరకు ఒప్పుకున్నారని పొంతన లేని సమాధానమిచ్చారు. తండ్రి చెప్పిన ప్రకారమే అయితే, అదే విషయాన్ని ఎంవోయూలో పేర్కొనే వారు కదా? చెల్లెలు కనక ప్రేమాభిమానాలతో ఈ ఆస్తులిస్తున్నట్టు ఎందుకు పేర్కొంటారు? అది కూడా తండ్రి మరణించిన పదేళ్ల తరవాత అలా ఎందుకు చేస్తారనే ప్రశ్నకు ఆమెవద్ద సమాధానం లేదు. పైపెచ్చు జగన్ ఇస్తానన్న ఆస్తులన్నీ ఆయన సొంతంగా ఆర్జించినవి.
ఆయన పెట్టుబడులు పెట్టి నిర్మించినవి. ఆ వ్యాపారాలకు సంబంధించి జగన్ పలు అక్రమ కేసులనూ ఎదుర్కొంటున్నారు. ఇవే కేసుల్లో ఏడాదిన్నర పాటు జైల్లో కూడా ఉండి వచ్చారు. వీటికి సంబంధించి పెట్టుబడుల్లో కానీ, వ్యాపార నిర్మాణంలో గానీ షర్మిలకు ఏమాత్రం భాగం లేదు. ఒక్కరోజు కూడా ఆ వ్యాపారాలను చూసిన సందర్భాలు లేవు. ఒక్క రూపాయి పెట్టుబడి కూడా లేదు.
మరి అలాంటి వ్యాపారాల్లో, ఆస్తుల్లో తనకు హక్కుందని ఎలా అంటారు? ఆమెకు నిజంగానే హక్కులు ఉండి ఉంటే ఆమె కూడా కేసులు ఎదుర్కోవాలి కదా? కానీ ఆమె ఏ కేసునూ ఎదుర్కోవటం లేదే? పైపెచ్చు జగన్‌పై అక్రమంగా ఈ కేసులు బనాయించిన కాంగ్రెస్‌కు ఇప్పుడామె నాయకురాలు. కేసులు ఎదుర్కొంటున్న జగన్‌ను ఇబ్బంది పెడుతూనే... జగన్ ఆస్తులు మాత్రం తనకు చెందాలనుకోవటంలోనే షర్మిల వ్యవహార శైలిని అర్థం చేసుకోవచ్చు.
అక్రమంగా తల్లి పేరిట షేర్లను మార్పిడి చేయటమే కాక ఎంఓయూలోని అంశాలకు కట్టుబడి ఉండలేదు కనక తానెందుకు ఎంఓయూ రద్దు చేసుకోకూడదని ప్రశ్నించిన జగన్... చెల్లెలితో చిన్నప్పటి నుంచీ ఉన్న అనుబంధాన్ని సైతం తన లేఖలో గుర్తు చేసుకున్నారు. ఇన్ని చేసినా సరే... ఇప్పటికైనా ఆమె వైఖరి మార్చుకుంటే భవిష్యత్తులో ఆమెకు తన ఆస్తుల్లో వాటా ఇచ్చే అంశాన్ని ఆలోచిస్తానని కూడా పేర్కొన్నారు. అదీ... అన్నయ్యగా జగన్ అభిమానమంటే.
న్యాయపరమైన అంశాలను సవాల్ చేయటం తప్పనిసరి కనక... గిఫ్ట్ డీడ్‌ను దుర్వినియోగం చేయడాన్ని సవాల్ చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఇందులో కూడా తమకు కావాల్సిన అంశాలను ప్రచురిస్తూ ఎల్లో మీడియా చెలరేగిపోతుండటం... దానికి షర్మిల వంత పాడుతుండటమే ఇప్పుడు విచిత్రం!!
Comments
Please login to add a commentAdd a comment