వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీతో మరో జన్మ | YSR Aarogyasri Coverage For 2434 Medical Procedures Across AP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీతో మరో జన్మ

Published Wed, Nov 11 2020 2:16 AM | Last Updated on Wed, Nov 11 2020 8:31 AM

YSR Aarogyasri Coverage For 2434 Medical Procedures Across AP - Sakshi

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ యాప్‌ తెలుగు, ఇంగ్లిష్‌ వెర్షన్‌లను ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు, ఉన్నతాధికారులు

ఇది ప్రజల గుండె చప్పుడు తెలిసిన ప్రభుత్వం. ఇది ప్రతి ఒక్కరి ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం. ఇది బతికించే మనసున్న ప్రభుత్వం. పేదలు, సామాన్యులకు అండగా నిలిచే ఆరోగ్య శ్రీ అమలు నాకు సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తోంది. ఈ పథకం ప్రభుత్వానికి ఎంతో ముఖ్యం. దేవుడి దయతో ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నా.

మరో జన్మనిచ్చే ఈ పథకాన్ని మన ప్రభుత్వం నాలుగు అడుగులు ముందుకు వేసి మరింత గొప్పగా మారుస్తోంది. అందుకే ఇతర పథకాలకు భిన్నంగా ఈ పథకాన్ని చూడాలి. ప్రతి అధికారి దీన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి. పేదలందరికీ మంచి వైద్యం ఉచితంగా అందేలా దృష్టి పెట్టాలి. 
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ మరో జన్మనిచ్చే పథకమని, ఆస్తులు అమ్ముకునే అవసరం లేకుండా నిరుపేదలు, నిస్సహాయులకు తన ఖర్చుతో ప్రభుత్వమే వైద్యం చేయించే పథకమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైద్యం బిల్లు వెయ్యి రూపాయలు దాటితే వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ వర్తింప చేసే ప్రక్రియను రాష్ట్రంలోని మిగిలిన ఆరు జిల్లాలైన శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురంలకు విస్తరించే కార్యక్రమాన్ని మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి ప్రారంభించారు. దీంతో పాటు కొత్తగా ఆరోగ్యశ్రీలో చేర్చిన 234 చికిత్సలను కలిపి మొత్తం 2,434 వైద్య చికిత్సలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తింప చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని కలెక్టర్లు, వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ లబ్ధిదారులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ పథకం అమలు దిశలో అడుగులు వేశామన్నారు. ఈ 17 నెలల్లో, కోవిడ్‌ కష్టకాలంలోనూ ఆర్థికంగా కనీవినీ ఎరుగని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ వైద్య ఆరోగ్య రంగం మీద మమకారంతో ఎన్ని అడుగులు వేశామో అందరికీ తెలుసని చెప్పారు.  

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో రాష్ట్రవ్యాప్తంగా 2,434 వైద్య ప్రక్రియల ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, అధికారులు 

పక్కాగా పథకం
► రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుంబాలను ఈ పథకం పరిధిలోకి తెచ్చాం. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారికి వర్తింపచేశాం. దీని వల్ల దాదాపు 95 శాతం కుటుంబాలకు పథకం వర్తిస్తోంది. హెల్త్‌ రికార్డులతో అనుసంధానం అయిన క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కార్డులు జారీ చేశాం.  
► ఈ ఏడాది జనవరి 3న పశ్చిమ గోదావరి జిల్లాలో 2,059 చికిత్సలతో పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభించాం. అదే సమయంలో మిగిలిన జిల్లాల్లో 1,313 రకాల చికిత్సలను పథకంలోకి తీసుకువచ్చాం.
► గతంలో కేవలం 1,059 చికిత్సలు మాత్రమే ఉండేవి. మన ప్రభుత్వం వచ్చాక ఏకంగా రూ.680 కోట్లు ఆరోగ్యశ్రీ తరఫున నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌కు బకాయిలు చెల్లించాం. 
► ఆరోగ్యశ్రీ పరిధి విస్తరిస్తూ, ఈ ఏడాది జూన్‌ 16న కర్నూలు, కడప, గుంటూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాలకు విస్తరించాం. ఇప్పుడు మిగతా జిల్లాల్లోనూ వర్తింప చేశాం. కోవిడ్, పోస్ట్‌ కోవిడ్‌ చికిత్సను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చాం. 

ఆస్పత్రుల నిర్మాణం.. సిబ్బంది నియామకం
► 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, 560 అర్బన్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నాం. 1,147 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 52 ఏరియా ఆస్పత్రులు, 191 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్ల రూపురేఖలు మారుస్తున్నాం. కొత్తగా 16 వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. 
► 3 క్యాన్సర్‌ ఆస్పత్రులు, రెండు కిడ్నీ స్పెషాలిటీ ఆస్పత్రులు, గిరిజనుల కోసం ఐటీడీఏల పరిధిలో 6 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాం. ఏకంగా 1088 కొత్త 104, 108 వాహనాలను రాష్ట్రం నలు మూలలకు పంపాం. 
► కొత్తగా 9,712 మంది వైద్య సిబ్బంది నియామకం చేపట్టాం. ప్రతి ఆస్పత్రిలో ఆరోగ్యమిత్ర (హెల్ప్‌ డెస్క్‌)లను ఏర్పాటు చేస్తున్నాం.  
► ఆరోగ్యశ్రీ యాప్‌ తెలుగు, ఇంగ్లిష్‌ వెర్షన్లను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. లబ్ధిదారులు ఈ యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకొని తమ హెల్త్‌ రికార్డులు పరిశీలించుకోవచ్చు. ఇందులో అన్ని ఆస్పత్రుల చిరునామా, చికిత్సల వివరాలు ఉన్నాయి.

అప్పుడు.. ఇప్పుడు
► గత ప్రభుత్వంలో వైద్య రంగం పరిస్థితి దారుణం. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు అన్నీ బకాయిలే. ఆస్పత్రుల్లో ఎలుకలు కొరికి పిల్లలు చనిపోవడం, జనరేటర్‌ లేక ఆపరేషన్‌ థియేటర్లలో సెల్‌ఫోన్‌ వెలుగులో ఆపరేషన్లు చేయడం మనందరికీ తెలిసిందే. 
► ఈ 17 నెలల కాలంలో పరిస్థితులను పూర్తిగా మార్చాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని 130కి పైగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో అర్హులకు ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తున్నాం. 
► ఆపరేషన్‌ చేయించుకున్న రోగులను ఆరోగ్య ఆసరాతో ఆదుకుంటున్నాం. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, తలసేమియా, డయాలసిస్‌ రోగులకు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు పింఛన్‌ ఇస్తున్నాం. 
► పుట్టుకతో వినికిడి లోపం ఉన్న చిన్నారుల రెండు చెవులకు కాక్లియర్‌ పరికరం అమర్చే పథకం, అన్ని రకాల క్యాన్సర్లకు, బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ చికిత్సలను సైతం ఈ పథకం కిందకు తెచ్చాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement