సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి ‘వైఎస్సార్ ఆసరా’ పథకాన్ని అమలు చేస్తామంటూ ఎన్నికల ముందు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పెద్ద హామీ శుక్రవారం నుంచి అమలు కానుంది. గత అసెంబ్లీ ఎన్నికల రోజు నాటికి (2019 ఏప్రిల్ 11) పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లించే ఈ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. 8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.27,168.83 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో నేరుగా ఆయా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేయనుంది. ఇందులో భాగంగా తొలి ఏడాది రూ.6,792.20 కోట్లను ఆయా కార్పొరేషన్ల ద్వారా నేడు జమ చేయనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. (చదవండి: మరో మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్)
►ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలన్న నిర్ణయాన్ని అక్కచెల్లెమ్మలకే వదిలేస్తున్నామని, బ్యాంకర్లు ఆ మొత్తాన్ని పాత అప్పులకు మినహాయించుకోకూడదని సర్కార్ స్పష్టం చేసింది.
►2014లో చంద్రబాబు ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలన్నీ భేషరతుగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారు. దీంతో మహిళల అప్పులు తీరక, వాటిపై వడ్డీలకు వడ్డీలు పెరిగిపోయాయి. ఫలితంగా అప్పట్లో సుమారు రెండు లక్షల పొదుపు సంఘాలు బ్యాంకుల వద్ద నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు)గా ముద్ర వేయించుకున్నాయి. ఏ గ్రేడ్‌లో ఉండాల్సిన దాదాపు 5 లక్షల సంఘాలు సీ, డీ గ్రేడ్లకు పడిపోయాయి.
►దీనికితోడు అప్పటి టీడీపీ ప్రభుత్వం జీరో వడ్డీ డబ్బులు రూ.3,036 కోట్ల మేర ఎగ్గొట్టింది. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక సున్నా వడ్డీ పథకం కింద గత ఏడాది రూ.1,400 కోట్లు చెల్లించింది. తాజాగా వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత వంటి పథకాల వల్ల పొదుపు సంఘాల వ్యవస్థ తిరిగి గాడిలో పడింది. దీంతో ఇప్పుడు 99.27 శాతం రుణాలను సకాలంలో చెల్లిస్తున్నాయి.
నేటి నుంచి వైఎస్సార్ ఆసరా వారోత్సవాలు
►వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభోత్సవాన్ని వారం రోజుల పాటు ఉత్సవంలా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో రాజాబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
►శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. మహిళలకు రూ.6,792 కోట్లకు సంబంధించిన చెక్కును సీఎం లాంఛనంగా అందజేస్తారు. ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలోని పొదుపు సంఘాల మహిళలు తిలకించేలా రైతు భరోసా కేంద్రాల్లో వీడియో వసతి ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టర్, సంబంధిత జిల్లా మంత్రులతో పాటు ఐదు పొదుపు సంఘాలకు చెందిన మహిళలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
►సీఎం జగన్ రాసిన లేఖ కాపీలను జిల్లా కేంద్రాల్లో మంత్రులు మహిళలకు అందజేస్తారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు.
ఏడు రోజుల కార్యక్రమాలిలా..
11వ తేది : రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, గ్రామ, వార్డు స్థాయిల్లో పథక ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుపుతారు.
12 నుంచి16 వరకు : స్థానిక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలో రోజుకొక మండలంలోని గ్రామ, వార్డు స్థాయిలో ఐదేసి పొదుపు సంఘాల లబ్ధిదారు మహిళలతో సమావేశాలు నిర్వహిస్తారు. మహిళా సాధికరత గురించి చర్చిస్తారు. స్థానిక సెర్ప్ సిబ్బంది ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
17వ తేది : ఇటీవల వైఎస్సార్ చేయూత పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలు కొత్తగా చేపట్టిన వ్యాపారాలను స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు. వైఎస్సార్ ఆసరా వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో ఘనంగా నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment