సాక్షి, అమరావతి: నడిసంద్రంలో బతుకు పోరాటం చేసే గంగపుత్రులకు వేట నిషేధ సమయంలో అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతి పంపిణీకి ఏర్పాట్లుచేసింది. ఈ ఏడాది 1,23,519 మంది అర్హత పొందగా, వారికి ఈనెల 16వ తేదీన బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి రూ.123.52 కోట్లు జమచేయనున్నారు.
గతంలో అరకొరగా సాయం
రాష్ట్రంలో తడ నుంచి ఇచ్ఛాపురం వరకు సముద్రతీర ప్రాంతం విస్తరించి ఉంది. వేట నిషేధ వేళ గతంలో రూ.2వేలు, బియ్యం, ఇతర నిత్యావసరాలు ఇచ్చేవారు. ఆ తర్వాత నిత్యావసరాలు నిలిపివేసి రూ.4వేల చొప్పున భృతి ఇచ్చేవారు. అది కూడా వేట నిషేధం ముగిసిన ఆర్నెల్లకో ఏడాదికో తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఇచ్చేవారు.
ఈ నేపథ్యంలో.. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ భృతిని రూ.4వేల నుంచి రూ.10వేలకు పెంచడమే కాక.. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లతో పాటు సంప్రదాయ నావలపై ఆధారపడి జీవించే వారికి సైతం నిషేధకాలం ముగియకుండానే భృతినందిస్తూ సీఎం జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ కారణంగా బోట్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. 2019–20 నాటికి రాష్ట్రంలో అన్ని బోట్లు కలిపి 14,299 ఉండగా, ప్రస్తుతం రాష్ట్రంలో 1,610 మెకనైజ్డ్, 22,011 మోటరైజ్డ్, 6,343 సంప్రదాయ బోట్లు ఉన్నాయి. వీటిపై ఆధారపడి జీవించే మత్స్యకార కుటుంబాల సంఖ్య 1.60 లక్షలకు చేరింది.
ఐదు రెట్లు పెరిగిన సాయం
వేట నిషేధం అమలులోకి వచ్చిన వెంటనే అర్హుల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. ఆర్బీకేల్లో పనిచేసే మత్స్య సహాయకులు, వలంటీర్, సాగర మిత్రలతో కూడిన బృందాలు లబ్ధిదారుల గుర్తింపునకు శ్రీకారం చుట్టాయి. తీరానికి చేరుకున్న బోట్లను పరిశీలించి, వాటిపై జీవనోపాధి పొందే మత్స్యకార కుటుంబాలను గుర్తించారు. ఆరు దశల వెరిఫికేషన్ అనంతరం అర్హుల జాబితాలను సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించారు.
అభ్యంతరాలు స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత తుది జాబితాలను ప్రకటించారు. ఈ విధంగా 1,23,519 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో బీసీలు 1,17,757 మంది, ఎస్సీలు 2,946, ఎస్టీలు 970, ఓసీలు 1,846 మంది ఉన్నారు. వీరి వివరాలను సోషల్ ఆడిట్‌లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున రూ.123.52 కోట్లను ఈనెల 16న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జమచేయనున్నారు.
కానీ, టీడీపీ ఐదేళ్ల పాలనలో భృతికింద 3 లక్షల మందికి రూ.104.62 కోట్లు ఇస్తే, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది జమచేయనున్న మొత్తంతో కలిపి ఐదేళ్లలో 5.38 లక్షల మందికి రూ.538 కోట్ల మేర సాయమందించింది. అంటే టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే లబి్ధదారుల సంఖ్య 2.38 లక్షల మేర పెరిగితే, సాయం ఐదు రెట్లు పెరిగింది.
మాటల్లో చెప్పలేను..
మా బంధువుకు చెందిన తెప్పపై ఆధారపడి 20 ఏళ్లుగా జీవిస్తున్నా. వేటలేని సమయంలో ఏనాడు ఏ ప్రభుత్వం సాయం చేయలేదు. జగన్ ప్రభుత్వం నాలుగేళ్లుగా రూ.10వేల చొప్పున అందిస్తున్న సాయం అక్కరకొస్తోంది. ఎలాంటి పైరవీల్లేకుండా ఎంపిక చేస్తున్నారు. – వై.అప్పలరాజు, రాజయ్యపేట, అనకాపల్లి జిల్లా
వరుసగా ఐదో ఏడాది భృతి
గడిచిన నాలుగేళ్లుగా వేట నిషేధ కాలం ముగియకుండానే వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద భృతినందించాం. అదేవిధంగా ఐదో ఏడాది కూడా సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. ఈ ఏడాది 1.23 లక్షల కుటుంబాలు అర్హత పొందగా, వారి ఖాతాల్లో ఈనెల 16న వేట నిషేధ భృతిని జమచేసేందుకు ఏర్పాట్లుచేశాం. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ
Comments
Please login to add a commentAdd a comment