సాక్షి, విశాఖపట్నం : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్వర్గీయులై 11 ఏళ్లు పూర్తయినా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల గుండెల్లో అలాగే నిలిచిపోవటానికి కారణం ఆయన చేసిన మంచి కార్యక్రమాలేనని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవడమే మహానేత వైఎస్సార్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. బుధవారం మద్దిలపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో వైఎస్సార్ 11వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి, ఎంపీలు ఎంవీవీ, మాధవి, ఎమ్యెల్యే అదీప్ రాజ్, మాజీ ఎమ్యెల్యే పంచకర్ల, రెహ్మాన్, మల్ల విజయ ప్రసాద్, టైనాల విజయ్ కుమార్, కుంభ రవిబాబు, చింతలపూడి వెంకట రామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డితో పాటు కన్వీనర్లు, అనుబంధ సంఘాల నేతలు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... ‘‘ కొన్ని ఒత్తిళ్లకు లోనై అభ్యర్థులను ఎంపిక చేసి ఉండవచ్చు. అభిప్రాయ భేదాలను మర్చిపోయి, పార్టీ గెలుపుకు కృషి చేద్దాం. పొరపాట్లు సరిదిద్దుకుని, ప్రతి వార్డుకు వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తేనే ఎన్నికలకు సన్నద్దం అవుతాం. విశాఖ చంద్రబాబు చెప్పినట్లుగా అభివృద్ధి కాలేదు. ఐటీ సెజ్, ఫార్మా సెజ్ బీఆర్టియస్, రోడ్ల విస్తరణ, పారిశ్రామికీకరణ వైఎస్సార్ హాయాంలోనే జరిగింది. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకురావడానికి చంద్రబాబు అడ్డుపడుతున్నార’’ని అన్నారు. ( నాకు తెలిసిన మహనీయుడు )
ఏపీ చరిత్ర ఉన్నంత కాలం వైఎస్సార్ చిరస్థాయిగా ఉంటారు
ఆంధ్ర్రప్రదేశ్ చరిత్ర ఉన్నంత కాలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్థాయిగా ఉంటారని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. సంక్షేమానికి వైఎస్సార్ బ్రాండ్ అంబాసిడర్ అని కొనియాడారు. నవ శకం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోట్లాది రూపాయల సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. జూమ్ రాజకీయాలు చేసినా సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధిని ఆపలేరన్నారు. ( ప్రజా నాయకుడి దూరదృష్టి )
విశాఖ, అరకు ఎంపీలు ఎంవీవీ, మాధవిలు మాట్లాడుతూ.. ప్రతి పేద గుండెలో ఇల్లు కట్టుకున్న వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు. దేశంలో మొట్టమొదటిసారి ఫీజు రీయింబర్సుమెంట్‌ను ప్రవేశపెట్టిన వ్యక్తి ఆయనేనని అన్నారు. గిరిజనులందరికీ పట్టాలు పంచిన ఏకైక వ్యక్తి వైఎస్సారేనని, ఆ తర్వాత ఏ నేత కూడా ఎకరం భూమి ఇవ్వలేదు సరికదా గిరిజనుల అభివృద్ధి పట్టించుకోలేదన్నారు. వైఎస్సార్ తర్వాత వైఎస్ జగన్ పట్టాలు ఇస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment