స్థలాన్ని పరిశీలిస్తున్న పెద్దిరెడ్డి, బొత్స, సజ్జల, తలశిల తదితరులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక తొలిసారిగా జూలై 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ప్లీనరీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్లీనరీని అత్యంత ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం మేరకు.. ప్లీనరీ నిర్వహణకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు.. బొత్స, పెద్దిరెడ్డి, టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గురువారం పలు స్థలాలను పరిశీలించారు. గుంటూరు–విజయవాడ ప్రధాన రహదారికి సమీపంలోని నాగార్జున వర్సిటీ పరిసర ప్రాంతాల్లో సువిశాలమైన రెండు ప్రదేశాలను ఎంపిక చేశారు. వాటి గురించి సీఎం వైఎస్ జగన్‌కు తెలిపి.. ఆయన ఆదేశాల మేరకు ప్లీనరీ నిర్వహించే ప్రదేశాన్ని ఖరారు చేయనున్నారు.
ఎన్నికలకు సమాయత్తం చేసే దిశగా..
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతాన్ని సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ దేశంలో ఎక్కడా లేని రీతిలో మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా రూ.1.41 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకే తీసుకెళ్లారు. నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలను సమూలంగా మార్చేశారు. ఈ అంశాలను ప్రజలకు వివరించడానికి గత నెల నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు.
తమ ఇళ్ల వద్దకు వస్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ.. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ప్లీనరీని వేదికగా చేసుకోవాలని సీఎం నిర్ణయించారు. 2024 ఎన్నికల్లో మరోసారి అఖండ విజయం సాధించడమే లక్ష్యంగా సమర శంఖం పూరించనున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2017 జూలై 8, 9న నాగార్జున వర్సిటీకి ఎదురుగా ఉన్న సువిశాలమైన మైదానంలో ప్లీనరీని నిర్వహించారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేశారు. అదే ఏడాది నవంబర్ 6న ఇడుపులపాయలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ప్రార్థనలు చేసి నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ‘ప్రజాసంకల్ప యాత్ర’ పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. అశేష ప్రజాదరణ మధ్య 341 రోజులపాటు 3,648 కి.మీ. చేసిన పాదయాత్రను 2019 జనవరి 9న ఇచ్ఛాపురం వద్ద ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment