కిక్కిరిసిన ‘కోట’ | YSRCP Samajika Sadhikara Bus Yatra in Tirupati District | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన ‘కోట’

Published Mon, Jan 29 2024 2:18 AM | Last Updated on Mon, Jan 29 2024 2:18 AM

YSRCP Samajika Sadhikara Bus Yatra in Tirupati District - Sakshi

సభలో ఐక్యత చాటుతున్న వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నేతలు  

తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కోట మండల కేంద్రంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర జనంతో హోరెత్తింది. అశేషజనం తరలిరావడంతో పట్టణంలోని పురవీధులు జనసంద్రంగా మారాయి. మహిళలు, యువత భారీ సంఖ్యలో పాల్గొని ‘జై జగన్‌’ నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను.. వాటి ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిగిన లబ్ధిని వివరించారు. చంద్రబాబు ఏనాడూ బీసీలను పట్టించుకోలేదని మండిపడ్డారు. కుటుంబాలను చీల్చడమే ఆ పార్టీల పని అని విమర్శించారు.

చిల్లకూరు: తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోట మండల కేంద్రంలో జరిగిన సామాజిక సాధికా­రత బస్సు యాత్ర జనంతో హోరెత్తింది. రాష్ట్ర ప్రభు­త్వం ఆధ్వర్యంలో చేకూరిన సామాజిక సాధికార­తను వివరించే క్రమంలో ఆదివారం నిర్వహించిన ఈ యాత్రకు అశేషజనం తరలిరావడంతో పట్టణంలోని పురవీధులు జనసంద్రంగా మారాయి. వైఎస్సార్‌షీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ ఎంపీ విజయ­సాయిరెడ్డి ఆధ్వర్యంలో గూడూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేరిగ మురళీధర్‌తో పాటు ఉప­ముఖ్య­మంత్రి నారాయణస్వామి, పలువురు ఎమ్మె­ల్యేలు, ఎమ్మెల్సీలతో పట్టణంలోని గోపాల్‌రెడ్డి విగ్ర­హం నుంచి సభాస్థలి వరకు ఆదివారం బస్సు­యాత్ర సాగింది. 500 మీటర్ల ఈ యాత్ర చేయ­డానికి గంటకు పైగా సమయం పట్టింది.

సభా వేది­కపై ముందుగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, జ్యోతిరావ్‌ ఫూలే, అల్లూరి సీతారామరాజు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సభను ఆరంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి మాట్లాడుతూ.. సోనియా, చంద్రబాబులు అన్యాయంగా జగన్‌ను జైలుకు పంపార­న్నారు. అయితే, ప్రజల ఆశీస్సులతో జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఐదేళ్లపాటు అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను గుర్తించి వారికి అండగా నిలిచారన్నారు. పేద ప్రజల గుండెల్లో సీఎం జగన్‌ కొలువుదీరారన్నారు. గతంలో కోవర్టులుగా పనిచేసిన వారు మోసంచేసి పార్టీలు మారారని మండిపడ్డారు. 

బాబుకు మళ్లీ ప్రతిపక్షమే..
అనంతరం, మాజీమంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్సార్‌ పేరును చార్జ్‌షీట్‌లో పెట్టిన పార్టీలు వస్తున్నాయని, వీరు కుటుంబాలను చీల్చడమే పనిగా పెట్టుకున్నార­న్నారు. ఎంతమంది దత్తపుత్రులతో కలిసి వచ్చినా చంద్రబాబుకు మళ్లీ ప్రతిపక్షమే మిగులుతుందని ఎద్దేవా చేశారు. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌­రావు మాట్లాడుతూ.. 30 ఏళ్లపాటు టీడీపీకి ఊడి­గం చేసినా ఏనాడూ బీసీలకు చంద్రబాబు ప్రాముఖ్యత ఇవ్వలేదన్నారు.

కనీసం రాజ్యసభకు బీసీలను పంపిన దాఖలాలూ లేవన్నారు. 56 నెలల సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఐదుగురు బీసీలను రాజ్యసభకు పంపిన ఘనత వైఎస్సార్‌సీపీ­దేనన్నారు. ఇక ఆరువందల బూటకపు వాగ్దానా­లను ఇస్తే ప్రజలు నమ్మి గెలిపించారని, వాటిలో పది కూడా అమలుచేయలేని దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు నిలిచిపోయారని పార్టీ మైనారిటీ సెల్‌ రాష్ట్ర అ«ధ్యక్షులు ఖాదర్‌బాషా విమర్శించారు. ఆ తర్వాత.. నెల్లూరు మేయర్‌ పొట్లూరి స్రవంతి మాట్లాడుతూ.. గిరిజన మహిళనైన తనను సీఎం జగనన్న ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారని, ఇంతకన్నా సామాజిక సాధికారత ఎక్కడ ఉందన్నారు. 

సీఎం నమ్మకాన్ని వమ్ము చేయను: మేరిగ
గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌ మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ తనపై నమ్మ­కం ఉంచి పార్టీ, నామినేటెడ్‌ పదవులతో పాటు ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌గా అవకాశాలు కల్పించార­ని, తనపై ఉన్న నమ్మకాన్ని ఏనాడూ వమ్ముచేయనని అన్నారు. గతంలో గూడూరు ఎమ్మెల్యేగా నమ్మకంతో ఒకరిని ఎంపిక చేస్తే పార్టీలో గెలిచి రొమ్ముగుద్ది చంద్రబాబు పంచన చేరారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్య­క్షులు నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కల్యాణచక్రవర్తి, ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement