సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత విపరీతంగా ఉందన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. రాష్ట్రంలో సూపర్ సిక్స్ లేదు, సూపర్ సెవెన్ లేదు.. ఎక్కడికక్కడ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబులాగా బాదుడు భారతదేశ చరిత్రలోనే ఎవ్వరూ చేసి ఉండరని ఎద్దేవా చేశారు.
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాల పార్టీల అధ్యక్షులు, పార్టీ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ విస్తృతంగా చర్చించారు. ప్రజా ఆందోళనలకు కార్యాచరణపై వైఎస్ జగన్ సూచనలు చేశారు.
సమావేశం సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విపతీరంగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆరు నెలల వ్యవధిలోనే ఇంతటి వ్యతిరేక ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు. సూపర్ సిక్స్ లేదు, సూపర్ సెవెన్ లేదు. ఎక్కడికక్కడ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి, దిగజారిపోయాయి. మొట్టమొదటి సారిగా మూడు త్రైమాసికాలుగా ఫీజు రియింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉంది. జనవరి వస్తే ఏకంగా రూ.2800 కోట్లు పెండింగ్ అవుతుందన్నారు.
అలాగే, వసతీ దీవెనకూ రూ.1100 కోట్లు పెండింగ్. ఫీజులు కడితే తప్ప కాలేజీలకు రావొద్దని చెప్తున్నారు. పిల్లలు చదువులు మానేసి పనులకు వెళ్తున్నారు. ఆరోగ్య శ్రీ బకాయిలు కూడా ఉన్నాయి. దాదాపు తొమ్మిది నెలల బిల్లులు పెండింగులో ఉన్నాయి. పేషంట్లు ఆస్పత్రులకు వెళ్తే ఉచితంగా వైద్యం అందే పరిస్థితి లేదు. 108, 104 ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదన్నారు.
బాబు బాదుడు చరిత్రలోనే ఫస్ట్..
రైతులకు ధాన్యం సేకరణలో కనీస మద్దతు ధరలు లభించడం లేదు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఈ-క్రాప్ చేసి, ఆర్బీకేల ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేసేవాళ్లు. ప్రతీ రైతుకూ మద్దతు ధర వచ్చేది. జీఎల్‌టీ ఛార్జీలు కూడా చెల్లించే వాళ్లం. అదనంగా ప్రతీ ఎకరాకు అదనంగా రూ.10వేలు వచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ పూర్తిగా రైతులు దెబ్బతిన్నారు. వర్షాల దెబ్బకు రైతులు కుదేలవుతున్నారు. ధాన్యం రంగు మారుతోంది, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు మొదలైంది. ఇప్పటికే రూ.6వేల కోట్ల వడ్డన ప్రారంభమైంది. మరో రూ.9వేల కోట్ల వడ్డన వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్థాయి బాదుడు భారతదేశ చరిత్రలోనే ఎవ్వరూ చేసి ఉండరని ఎద్దేవా చేశారు.
.. ఎవ్వరూ నిరసన వ్యక్తం చేయకూడదని తప్పుడు కేసులు పెడుతున్నారు. కేసులు మాన్యుఫ్యాక్చర్ చేసి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎప్పుడూ జరగలేదు. రాష్ట్రం అంతటా భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఎవ్వరూ ఆందోళన చేయకూడదని ఇలా చేస్తున్నారు. అవినీతి విచ్చలవిడిగా నడుస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. ఎన్నికల్లో ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి పైసా ఆదాయం రాకపోగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కంటే డబుల్ రేట్లకు ఇసుక అమ్ముతున్నారు. నీకింత.. నాకింత.. అని పంచుకుంటున్నారని ఆరోపించారు.
అంతటా బెల్టు షాపులే..
ప్రభుత్వం నడుపుతున్న మద్యం షాపులు ఎత్తివేశారు. మొత్తం షాపులన్నింటినీ చంద్రబాబు, ఆయన మనుషులు చేతిలోకి తీసుకున్నారు. గ్రామంలో వేలం పాటలు పెట్టి బెల్టు షాపులు ఇస్తున్నారు. బెల్టు షాపులు లేని వీధి, గ్రామం లేదు. ఒక్కో బెల్టుషాపునకు రూ.2-3లక్షల వేలం పాట పెడుతున్నారు. ఏ పని జరగాలన్నా, ఏ పరిశ్రమ నడుపుకోవాలన్నా కమీషన్లు ఇచ్చుకోవాల్సిందే. ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకు ఇంత అని చెల్లించుకోవాల్సిందే. రౌడీ మామ్మూళ్ల కోసం వసూలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
సమయం వచ్చింది..
నెల్లూరు క్వార్ట్‌జ్ గనులు కొట్టేయడానికి పక్కా ప్లాన్ చేశారు. ప్రజల తరఫున గళం విప్పాల్సిన సమయం వచ్చింది. అనుకున్న దాని కంటే ముందుగానే ఆ సమయం వచ్చింది. ఆరు నెలలకే అలాంటి పరిస్థితి తలెత్తింది. జిల్లా అధ్యక్షులు క్రియాశీలక పాత్ర పోషించాలి. కరెంటు ఛార్జీలు పెంపు, ధాన్యం సేకరణలో దళారీల రాజ్యం, మద్దతు ధర దక్కకపోవడం, ఫీజు రియింబర్స్‌మెంట్ అంశాలు ప్రజలను ఇప్పుడు ఇబ్బందిపెడుతున్నాయి. మండలం, నియోజకవర్గాలు, జిల్లా స్థాయి మూడు స్థాయిల్లో ఆందోళనలపై కార్యాచరణ చేపట్టాలి’ అని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment