
సాక్షి, తిరుమల: టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన టీటీడీ ఛైర్మన్‌గా మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో టీటీడీ బోర్డు సభ్యుల నియామకం జరగనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీటీడీ ఛైర్మన్‌గా రెండోసారి అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కలియుగ దైవం శ్రీనివాసుడి ఆశీస్సులతో.. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.
తిరుమల పవిత్రత కాపాడేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, తిరుమలపై కాలుష్య నివారణే లక్ష్యంగా.. ఎలక్ట్రిక్ వాహనాలను త్వరలో అందుబాటులోకి తీసుకోస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆర్గానిక్ మూల పదార్థాలతో నైవేద్యం తయారీ, కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. మరిన్ని దేశీయ భాషల్లో ఎస్‌వీబీసీ ఛానల్‌ను తీసుకురానున్నట్లు తెలిపారు. డ్రోన్ల సాంకేతికతతో ఏడుకొండల భద్రత కల్పించనున్నట్లు తెలిపారు.