మైనారిటీలు, వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై యథేచ్చగా అల్లరిమూకల దాడులు
పౌరుల ప్రాణాలు, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ యంత్రాంగం వైఫల్యం
లక్షిత దాడులు, హింసాకాండను అరికట్టి బాధితులను సత్వరమే కాపాడండి
విధ్వంసకారులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి
ఫిర్యాదులు అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలి
బాధ్యులను గుర్తించేందుకు సిట్ ఏర్పాటుకు ఆదేశించండి
నిగ్గు తేల్చేందుకు ఇద్దరు విశ్రాంత జడ్జీలతో కమిటీని నియమించాలి
కేంద్ర హోంశాఖ, సీఎస్, డీజీపీని ఆదేశిస్తూ ఉత్తర్వులివ్వాలని అభ్యర్థన
హైకోర్టులో వైవీ సుబ్బారెడ్డి ‘పిల్’పై నేడు ధర్మాసనం విచారణ
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాల అనంతరం ఓ రాజకీయ పార్టీకి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని అల్లరి మూకలు సాగిస్తున్న విధ్వంసం, హింసాకాండపై రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. లక్షిత దాడులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. హింసను సత్వరమే కఠినంగా అణిచి వేసేలా కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించాలని కోరారు.
బాధితులు, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు తలపెడుతున్న వ్యక్తులు, సమూహాలను నియంత్రించేందుకు చట్ట ప్రకారం గట్టి చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. లక్షిత హింసపై ఫిర్యాదులు అందిన వెంటనే బాధ్యులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. హింసకు కారకులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు.
బాధితులు, వారి కుటుంబ సభ్యులకు తగిన రక్షణ కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. హింసకు దారి తీసిన పరిస్థితులను తేల్చేందుకు ఇద్దరు విశ్రాంత న్యాయమూర్తులతో ఓ కమిటీని నియమించేలా ఆదేశించాలని వైవీ సుబ్బారెడ్డి తన వ్యాజ్యంలో కోర్టును అభ్యర్థించారు. న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం విచారణ జరపనుంది.
పరిహారం బాధ్యత ప్రభుత్వానిదే..
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తక్షణమే కేంద్ర పారా మిలటరీ బలగాలను రప్పించాల్సిన అవసరం ఉందని సుబ్బారెడ్డి కోర్టుకు నివేదించారు. లక్షిత దాడుల్లో ప్రాణాలు, ఆస్తులు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
ఈ బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పించుకోజాలవని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేర్కొందని గుర్తు చేశారు. మరో ప్రత్యామ్నాయం లేనందున పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పరిరక్షించి సత్వర న్యాయం అందించేందుకు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ ఓటర్లే లక్ష్యంగా...
ప్రజల ప్రాణాలు, స్వేచ్చ, ఆస్తులను కాపాడే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి పారిపోవడానికి వీల్లేదని సుబ్బారెడ్డి తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. మారుమూల గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడులు, హింసాకాండకు తాజాగా అధికారం చేపట్టిన పార్టీ ఆమోదం ఉందన్నారు.
ఇందుకు సంబంధించిన వీడియోలను పరిశీలించాలని కోర్టుకు విన్నవించారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను నిరాశ్రయులను చేయడం, వారిపై రాళ్లతో దాడులు చేయడం లాంటి ఘటనలు ఆ వీడియోలో స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. డీజీపీ హరీ‹Ùకుమార్ గుప్తా, అదనపు డీజీ బాగ్చీ, పల్నాడు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి టీడీపీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ అధికారులు హింసను నిరోధించకుండా తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తెలిపారు.
గంటల వ్యవధిలో దాడులు మొదలు..
ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటలకే రాష్ట్రంలో దాడులు, హింసాకాండ మొదలయ్యాయని, ఉద్దేశపూర్వకంగా కొందరిని లక్ష్యంగా చేసుకుని అల్లరి మూకలు దాడులకు తెగబడ్డాయని సుబ్బారెడ్డి తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు కొంత సమయం ఉండటంతో దీన్ని ఆసరాగా చేసుకుని దాడులకు, హింసకు తెర తీశారని నివేదించారు.
ఇళ్లు, గ్రామాలను వదిలేసి వెళ్లకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరింపులకు దిగారన్నారు. ఈ హింస, దాడులపై తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎస్.నిరంజన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ తక్షణ జోక్యానికి రాష్ట్రపతి, గవర్నర్, డీజీపీకి లేఖలు రాశారని తెలిపారు. నిర్దిష్ట రాజకీయ పారీ్టతో సంబంధాలున్న వారినే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు.
పౌరుల ప్రాణాలు, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారన్నారు. విధ్వంసకారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నా, మైనారిటీలపై యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment