పోస్టుమార్టం కోసం సమాధిని తొలగిస్తున్న దృశ్యం
అన్నమయ్య: Madanapalle Postmortem Incident: ప్రమాదంలో చనిపోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు మృతదేహానికి 3 నెలల 10 రోజుల తర్వాత పోస్టుమార్టం నిర్వహించిన అరుదైన సంఘటన కురబలకోట మండలంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. పిచ్చలవాండ్లపల్లె పంచాయతీ పందివానిపెంటకు చెందిన రేపన చౌడప్ప (33) బెంగళూరులోని విఫ్రో కంపెనీలో సాప్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేసేవాడు. ఇతడికి భార్య శిల్ప, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న చౌడప్ప బెంగళూరు నుంచి మోటార్ సైకిల్‌పై ఇంటికి వస్తూ మదనపల్లె రూరల్ మండలంలోని చీకలబైలు వద్ద జరిగిన ప్రమాదంలో చనిపోయాడు.
తీవ్ర విషాదంలో కూరుకుపోయిన కుటుంబీకులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లకుండా పోస్టుమార్టం చేయకుండానే స్వగ్రామం పందివానిపెంటలో మరుసటి రోజు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే చౌడప్ప సాప్ట్‌వేర్ ఇంజినీరు కావడంతో అతడి మృతి తర్వాత అందించే బెనిఫిట్స్ కోసం కంపెనీ పోస్టుమార్టం సర్టిఫికెట్ కావాలని కోరింది. చౌడప్ప భార్య శిల్ప స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గంగాధరరావును కలసి తన భర్త చౌడప్ప మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి సర్టిఫికెట్ ఇప్పించాలని కోరింది.
ఆయన ఆదేశాలతో శుక్రవారం మదనపల్లె డీఎస్పీ కేశప్ప ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణ, తహసీల్దారు ఎం. భీమేశ్వరరావు పర్యవేక్షణలో సమాధిని తొలగించి మృతదేహాన్ని బయటకు తీయించారు. అక్కడే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. దానిని వీడియోలో చిత్రీకరించారు. మూడు నెలల తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారని తెలిసి పరిసర ప్రాంతాల ప్రజలు అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment