రాయచోటి టౌన్ : అత్తారింటి వేధింపులు తాళలేక చింతమాని నాగేశ్వరి (40) ఆదివారం ఆత్మహత్య చేసుకొంది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వీరబల్లి మండలం ఈడిగపల్లెకు చెందిన దాసరయ్యగారి వెంకటరమణ, సులోచనల గారి నాగేశ్వరిని చిన్నమండెం మండలానికి చెందిన నాగేశ్వర (అలియాస్ నగేష్)కు రూ.3 లక్షల డబ్బు, 10 తులాల బంగారం ఇచ్చి వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు చిన్నమండెం నుంచి 10 సంవత్సరాల క్రితమే రాయచోటికి జీవనోపాధి కోసం వచ్చారు.
ఈ క్రమంలో ఆమె ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. నగేష్ ప్రైవేట్ పనులు చేస్తుండటంతోపాటు ఓ పత్రిక (సాక్షి కాదు)లో విలేకరిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆరు నెలలుగా అత్తామామలతో పాటు భర్త అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు కొనసాగుతుండేవి. శనివారం రాత్రి తన పుట్టిన ఊరు అయిన ఈడిగపల్లెలో జరిగే పీర్లపండుగకు వెళ్లాలని భర్తను కోరింది. అందుకు ససేమిరా అన్నారు. అయితే ఆదివారం తమ ఇంటికి భోజనానికి రావాలని మృతురాలి తమ్ముళ్లు ఫోన్ చేయడంతో మళ్లీ భర్తను కోరినట్లు బంధువులు తెలిపారు.
తెల్లవారి ఏమి జరిగిందో తెలియదు కానీ 6–7 గంటల మధ్య సమయంలో పిల్లలు అందరినీ బయటకు పంపించారు. నగేష్ ఇంటిలో లేకుండా బయటకు వెళ్లిపోయాడు. అత్త మాత్రం ఇంటిలో ఉంది. స్టోర్ రూంలో నాగేశ్వరి అపస్మారక స్థితిలో పడి ఉంది. తరువాత పిల్లలు బయట నుంచి ఇంటిలోకి వచ్చిన తరువాత గుర్తించడంతో బంధువులకు ఫోన్ చేసి తెలియజేశారు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయి పడి ఉంది.
వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని కడపకు రెపర్ చేశారు. మార్గంమధ్యంలో మృతి చెందడంతో తిరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన తరువాత మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు నగేష్‌పై కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment