వైవీయూ ముఖద్వారం
వైవీయూ 18వ వార్షికోత్సవ వేడుకలు
ముఖ్య అతిథులుగా ఎస్వీయూ, ఏఎఫ్‌యూ వీసీలు
వైవీయూ : యోగివేమన నీకు వందనం.. విశ్వకవితాత్వికా నీకు వందనం.. అన్న విశ్వవిద్యాలయ గీతంతో ఉత్తేజితులవుతూ.. సామాజిక స్పృహ కల్పించిన ప్రజాకవి పేరుతో ఏర్పాటైన యోగివేమన విశ్వవిద్యాలయం 18వ వ్యవస్థాపక, వార్షికోత్సవ వేడుకలకు సిద్ధమైంది. 2006 మార్చి 9వ తేదీన పీజీ కేంద్రం నుంచి విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెంది నేడు 27 కోర్సులతో విలసిల్లుతోంది. దాదాపు 1500 మంది విద్యార్థులు, 100 మంది అధ్యాపక బృందం, 300 మంది దాకా బోధనేతర సిబ్బంది, 100 మంది దాకా పరిశోధక విద్యార్థులతో ప్రగతి పథంలో దూసుకువెళ్తోంది. 1977 నవంబర్ 20వ తేదీన తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం కడప నగర సమీపంలో పీజీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2006లో 652 ఎకరాల్లో విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది.
అభివృద్ధికి అడుగులు.. ఇలా...
యోగివేమన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విశ్వవిద్యాలయానికి నిధుల వరద పారించారు. వైవీయూకు 2012లో 12బీ గుర్తింపు సైతం లభించడంతోపాటు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, ప్రపంచ పరిశోధకుల జాబితాల్లో స్థానం, పలు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులను విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం సొంతం చేసుకున్నారు. అదే విధంగా 2022 నవంబర్‌లో విశ్వవిద్యాలయం న్యాక్ ఏ గ్రేడ్ సాధించి సత్తా చాటింది. విశ్వవిద్యాలయం 2023 జూన్‌లో విడుదల చేసిన ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లో దేశంలోని అత్యుత్తమ విద్యాలయాల్లో 151 నుంచి 200 లోపు స్థానం సాధించింది. వీటితోపాటు పలు అవార్డులు, పలు ప్రొజెక్టులు సొంతం చేసుకుని అభివృద్ధి బాటలో పయనిస్తోంది.
గ్రంథాలయ ప్రాంగణంలో..
న్యాక్ ఏ గ్రేడ్ సాధించిన తర్వాత సరికొత్త హంగులతో విలసిల్లుతున్న విశ్వవిద్యాలయంలో శనివారం ఉదయం 10.00 గంటలకు వైవీయూలోని ఏపీజే అబ్దుల్‌కలాం కేంద్ర గ్రంథాలయ ప్రాంగణంలో 18వ వ్యవస్థాపక, కళాశాల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. వాస్తవానికి మార్చి 9వ తేదీన వ్యవస్థాపక దినోత్సవం రోజునే వేడుకలు నిర్వహించడం అనవాయితీ కాగా, వరుసగా సెలవులు రావడంతో విద్యార్థులు అందుబాటులో లేకపోవడంతో 23వ తేదీ శనివారం నిర్వహిస్తున్నారు. విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య వి.శ్రీకాంత్‌రెడ్డి, డాక్టర్ వైఎస్‌ఆర్ ఏఎఫ్‌యూ వైస్ చాన్సలర్ ఆచార్య బి.ఆంజనేయప్రసాద్, న్యూఢిల్లీకి చెందిన ఎస్‌ఆర్‌ఎఫ్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ వై.సురేష్‌రెడ్డి విచ్చేయనున్నారు
Comments
Please login to add a commentAdd a comment