వేటగాళ్ల నాటు బాంబులకు పాడి ఆవు బలి
గుర్రంకొండ : అడవి జంతువులను వేటాడేందుకు పొలాల గట్లపై వేటగాళ్లు ఏర్పాటు చేసిన నాటు బాంబులను పొరబాటున పాడిఆవు నమలడంతో నోరుమొత్తం పేలిపోయి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన గుర్రంకొండ మండలం సంగసముద్రం పంచాయతీ మామిళ్లవారిపల్లెలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి..
గ్రామానికి చెందిన నాగరాజ, రేవతి దంపతులు పాడి ఆవులను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం గ్రామానికి సమీపంలోని బండకింద గుట్టవైపు ఉన్న పొలాల వైపు నాగరాజు తమ పా డిఆవులను మేతకు తీసుకెళ్లాడు. గుట్టకిందనే పొలాలు ఉండడంతో గ్రామానికి చెందిన కొంతమంది వేటగాళ్లు అడవి జంతువులను వేటాడడం కోసం అక్కడక్కడా నాటుబాంబులు అమర్చారు. ఈ నేపథ్యంలో పొలాల గట్లపై గడ్డి మేస్తున్న పాడిఆవుల వద్ద పెద్ద శబ్దం రావడంతో నాగరాజు దంపతులు పరుగున అటువైపు వెళ్లారు. అప్పటికే వేటగాళ్లు అమర్చిన నాటుబాంబు నమిలి పాడిఆవు నోరు మొత్తం పేలిపోయి రక్తపుమడుగులో పడిపోయింది. సమాచారం అందుకున్న స్థానిక పశువైద్యాధికారి సునీల్ నాయక్ పాడి ఆవుకు వైద్యసేవలు అందించారు. పాడి ఆవు జీవించడం కష్టమని చెప్పారు. దీంతో జీవనోపాధి కోల్పోయిన పాడిరైతు దంపతులు బోరున విలపించడం అందరిని కలచివేసింది. ఈ సంఘటనకు గ్రామానికి చెందిన వేటగాళ్లు రెడ్డెప్ప, బాబు కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పాడి రైతు దంపతులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment