మదనపల్లె సిటీ : రోజంతా కఠిన ఉపవాసం... దైవంపైనే మనసు లగ్నం... పవిత్ర ఖురాన్ పఠనం, శ్రవణం.. తోటివారిపై ప్రేమ, సోదరభావం.. పేదలపై దయ, కరుణ, దాన, ధర్మాలు.. ఇలా శుభాల వసంతం రంజాన్ మాసమంతా ముస్లింలు నియమ నిష్టలు... దైవచింతనతో గడిపారు. చివరి ఘడియలు ఆసన్నం కావడంతో ఆదివారం ఆ నెలవంక కోసం ఆకాశం వంక ఎదురు చూడనున్నారు. నెల రోజుల పాటు సహరీ, ఇఫ్తార్, తరావీజ్ ప్రార్థనల్లో లీనమైన ముస్లింలు ఆదివారం సాయంత్రం షవ్వాల్ నెలవంక కోసం ఆకాశం వంక వేయికళ్లతో ఎదురు చూస్తారు. ఇఫ్తార్ సమయంలో పేలే బాణాసంచా ముందు, భానుడు పశ్చిమ సంద్రంలో మునిగే సమయంలో అందరి చూపు ఆకాశం వైపే ఉంటుంది. ఆకాశంలో నీలిమేఘాల మాటు నుంచి మబ్బు తెరలు తొలగించుకుని అరసున్న ఆకారంలో కనిపించే షవ్వాల్ నెల వంక కోసం అందరూ వెతుకుతారు. నీలి మేఘాల మాటు నుంచి అరుణాచల కాంతులతో వెలిగే అర్ద ఆకార చంద్రుడు.. కనబడగానే అందరిలో పూర్ణానందం వెల్లివిరిస్తుంది. ‘ఈద్ కా చాంద్ నజర్ ఆగయా... సబ్ కో ఈద్ ముబారక్’ అంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, ఈద్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అంబరాన్నంటే సంబరాలు చేసుకుంటారు.
ఈద్గా, మసీదుల ముస్తాబు..
ఈద్ ప్రార్థనల కోసం జిల్లాలోని మదనపల్లె, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పీలేరు, వాల్మీకిపురం, గుర్రంకొండ, బి.కొత్తకోట ప్రాంతాలతో పాటు ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉన్న పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఈద్గాలు, మసీదులు ముస్తాబవుతున్నాయి. మరోవైపు ముస్లిం సోదరులు ఇంటిల్లిపాది కొత్తగా కొనుగోలు చేసిన దుస్తులను చూసి మురిసిపోతున్నారు. ఆడపడుచులు బిరియానీ మసాలాల తయారీలో లీనమవుతున్నారు. చిన్నారులు తమ చేతులను మెహందీతో అలంకరించుకుంటున్నారు.
నెలవంక దర్శనంతోనే నిర్ణయం
షాబాన్ నెల 30వ రోజున రంజాన్ నెలవంక దర్శనంతో ఉపవాసదీక్షలను ప్రారంభించడం, 30 రోజుల అనంతరం షవ్వాల్ నెలవంక దర్శనంతో ఉపవాస దీక్షలను ముగించి ఈదుల్ ఫితర్ పండుగను జరుపుకోవడంలోనూ నెలవంక దర్శనమే కీలకం. చాలా సందర్భాల్లో రంజాన్ నెల వంక వాతావరణ ప్రభావంతో కనిపించనప్పుడు మతగురువులు ముఖ్యంగా ప్రభుత్వ సర్‌ఖాజీలు, హాఫీజ్‌సాబ్‌లు సమావేశమై రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని ముఫ్తీలు, హిలాల్ కమిటీలతో సమన్వయం చేసుకుని చంద్రుని దర్శన సమాచారం తెప్పించుకుంటారు. వారి నిర్ణయంతోనే రంజాన్ పండుగను నిర్ణయిస్తారు. ఆదివారం నెలవంక దర్శనమైతే సోమవారం పండుగ జరుపుకుంటారు.
లైలతెల్ జాయెజా..
పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా షవ్వాల్ నెలవంక దర్శనం అనంతరం ఆ రోజు రాత్రిని లైలతుల్ జాయెజా గా వ్యవహరిస్తారు. మసీదులోల ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. నెల రోజుల ఉపవాసదీక్షల ఫలితాన్ని ఈ రాత్రి ప్రార్థించేవారికి అల్లా ఇస్తారని ముస్లింలు విశ్వసిస్తారు. దీంతో మసీదుల్లో ముస్లింలు ఎక్కువ సంఖ్యలో చేరి దైవ ప్రార్థనలు చేస్తారు. ఎక్కువ సమయం దివ్యఖురాన్ పారాయణం, శ్రవణంతో గడుపుతారు.
ఆ నెలవంక కోసం ఆకాశం వంక..!


