తంబళ్లపల్లెలో తమ్ముళ్ల వర్గ పోరు
బి.కొత్తకోట : తంబళ్లపల్లె నియోజకవర్గంలో శనివారం జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో.. రెండు వర్గాల మధ్య వాగ్వాదం, జెండాలు ఎగురవేసే విషయంలో వివాదాలు, ఉద్రిక్తతలకు దారితీసి.. పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. బి.కొత్తకోటలో కేవలం పది మీటర్ల దూరంలో రెండు వర్గాలు ఒకేసారి జెండాలు ఎగురవేయడం.. స్థానికులను టెన్షన్‌కు గురిచేసింది. ఈ వివరాల్లోకి వెళ్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఓడిపోయిన అభ్యర్థి జయచంద్రారెడ్డి నాయకత్వంలో పని చేయలేమంటూ మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం బలంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు టీడీపీ ఆవిర్భావ వేడుకలు వేదికగా.. వర్గపోరు ఏస్థాయిలో ఉందో బహిర్గతం చేసింది.
బి.కొత్తకోటలో..
బి.కొత్తకోట జ్యోతిచౌక్‌లో శంకర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రారంభించిన జెండా వద్ద ఆయన వర్గీయులు వేడుకలకు సిద్ధమయ్యారు. దీనికి పదిమీటర్ల దూరంలో జయచంద్రారెడ్డి వర్గీయులు కొత్తగా జెండా దిమ్మెకట్టి అక్కడే వేడుకలు జరిపారు. రెండు వర్గాలు ఒకే సమయంలో కార్యక్రమాలకు సిద్ధం కావడంతో స్థానికులు టెన్షన్‌కు గురయ్యారు.
పెద్దమండ్యంలో..
పెద్దమండ్యం కూడలిలోని పాత జెండా దిమ్మెకు ఉన్న పైపును జయచంద్రారెడ్డి వర్గీయులు కోసేసి పక్కన పెట్టారని శంకర్ వర్గీయులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీనితో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్తత దారితీసింది. పోలీసులు జోక్యం చేసుకున్నారు. తర్వాత పాత జెండాను వదిలేసి ఎవరికి వారు వేర్వేరు చోట్ల వేడుకలు జరుపుకొన్నారు.
తంబళ్లపల్లెలో..
తంబళ్లపల్లెలో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయి వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. శంకర్ హయాంలో నిర్మించిన జెండా దిమ్మైపె జయంద్రారెడ్డి వర్గీయులు జెండాను ఎగురవేయడాన్ని శంకర్ వర్గం తీవ్రంగా ఆక్షేపించింది. శంకర్ వర్గం జెండా ఎగురవేసేందుకు రాగా.. అక్కడ జయచంద్రారెడ్డి వర్గీయులు అడ్డుగా బ్యానర్ పెట్టడంతో తీవ్రస్థాయిలో రెండు వర్గాల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. ఎస్‌ఐ, పోలీసులు చేరుకుని సర్దిచెప్పారు. తర్వాత శంకర్ వర్గం అన్నదానం చేసి వెళ్లిపోయింది.
ములకలచెరువులో..
జయచంద్రారెడ్డి సొంత మండలం ములకలచెరువులో శంకర్ వర్గీయుడు, మండల కన్వీనర్ సిద్దా మిగతా మండలాలకు భిన్నంగా కార్యక్రమం నిర్వహించి బలప్రదర్శన చేశారు. దీనితో జయచంద్రారెడ్టి వర్గం పోటీ కార్యక్రమాలు నిర్వహించారు.
పెద్దతిప్పసముద్రంలో..
పెద్దతిప్పసముద్రంలో ఉద్రిక్తత పరిస్థితులను ముందే పసిగట్టిన ఎస్‌ఐ రెండువర్గాలతో శుక్రవారమే చర్చించి ఇబ్బందికర వాతావరణం సృష్టించొద్దని స్పష్టం చేశారు. దీనితో రెండు వర్గాలు ఎవరికి వారు వేడుకలు జరుపుకొని వెళ్లిపోయారు.
● కురబలకోట మండలంలోనూ రెండు వర్గాలు పోటాపోటీగా వేడుకలను జరుపుకొన్నారు.
టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో ఉద్రిక్తత
జేసీఆర్, శంకర్ వర్గాల మధ్య వాగ్వాదం


