
సభ్యులు లేకుండానే మండల సమావేశం
బి.కొత్తకోట : బి.కొత్తకోట మండల మీట్‌ను సభ్యులు లేకుండానే నిర్వహించడం చర్చనీయాంశమైంది. గురువారం ఎంపీపీ లక్ష్మీనరసమ్మ అధ్యక్షతన మొదలైన సమావేశాన్ని 10 మంది ఎంపీటీసీ సభ్యులు బహిష్కరించారు. 11 మంది ఎంపీటీసీల్లో ఎంపీపీ మినహాయిస్తే.. మిగిలిన వారంతా సమావేశానికి హాజరైన కొన్ని నిమిషాలకే బహిష్కరించి వెళ్లిపోయారు. వీరితోపాటే అందరూ సర్పంచులు బహిష్కరించారు. అయితే మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలను మొత్తం ఎంపీటీసీలు బహిష్కరిస్తే.. ఆ సమావేశాన్ని అధికారులు వాయిదా వేయాలే కాని నిర్వహించకూడదన్న నిబంధన ఉందని అధికారులు అంటున్నారు. అయితే ఒక్క ఎంపీటీసీ లేకున్నా మండల మీట్‌ను కొనసాగించడంపై చర్చకు దారితీసింది. సమావేశానికి మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు. ఎంపీటీసీలు ఉంటే సమస్యలపై చర్చించడం లేదా అభివృద్ధి పనులపైనా సమీక్షించడం జరుగుతుంది. కేవలం అధికారులున్న సమావేశంలో వారికి వారే సంబంధిత శాఖకు సంబంధించిన వివరాలను వెల్లడించుకున్నారు. సభ్యులు కాని కొందరు.. అధికారులను కొన్ని అంశాలపై ప్రశ్నించారు. అధికారులు చర్చించుకున్నా, ఏదైనా అంశాలపైనా, అభివృద్ధి పనులపైనా ఆమోదిస్తూ తీర్మానం చేయాలంటే ఎంపీటీసీలు హాజరవ్వాలి. వారి ఆమోదంతో తీర్మానం చేయాలి. అలా కాకుండా ఎంపీటీసీలు హాజరు కానప్పుడు అధికారులు తమశాఖ అంశాలను ఎవరితో పంచుకోవాలి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేది ఎవరు అన్నది చర్చకు వచ్చింది. సమావేశాలు నిర్వహించేది ఎంపీటీసీలతో.. వాళ్లే హాజరు కానప్పుడు సమావేశానికి అర్థం ఏముందని అంటున్నారు. ఎంపీటీసీలు లేని సమావేశానికి విలువ లేనప్పటికీ కొనసాగించి పూర్తి చేయడం విడ్డూరమని మండల పరిషత్ అధికారులే అంటున్నారు.
వాళ్లకు ఆహ్వానం ఎందుకో..?
బి.కొత్తకోట మండల మీట్‌కు టీడీపీకి చెందిన ముగ్గురు, బీజేపీ, జనసేన నుంచి ఒక్కొక్కరిని అధికారులు ఆహ్వానించారు. ప్రజాప్రతినిధులు కానటువంటి వ్యక్తులను, ఎంపీటీసీ కాని వారు సమావేశంలో ఉండకూడదని సర్కులర్‌లో అధికారులు స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ ఆ ఐదుగురిని రప్పించి సమావేశం ముందు వరసలో కూర్చోబెట్టారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సభ్యులను మాత్రమే లోపలికి పంపిన పోలీసులు.. వీరిని కూడా నిలువరించినా హాజరయ్యే సభ్యుల జాబితాలో వీరు ఉన్నారని అధికారులు చెప్పడంతో పోలీసులు అనుమతిచ్చారు. కాగా ఈ విషయమై విలేకరులు ఎంపీడీఓ దిలీప్‌కుమార్‌ను వివరణ కోరగా.. చిత్తూరు జెడ్పీ సీఈవో మౌఖిక ఆదేశాల మేరకు కూటమికి చెందిన ఐదుగురు నాయకులను మండల మీట్‌కు ఆహ్వానించడం జరిగిందన్నారు. మండల పరిషత్‌లో ఈ పార్టీలకు చెందిన ఎంపీటీసీలు లేనందున జెడ్పీ సీఈవో ఆదేశాలతో ఆహ్వానించామని చెప్పారు.
ఎంపీటీసీలు, సర్పంచ్‌లు బహిష్కరణ
వాయిదా వేయకుండా, నిర్వహించిన వైనం
నిబంధనలకు విరుద్ధమంటున్న అధికారులు
ఆపైన కూటమి నేతలకు
అధికారిక ఆహ్వానం