రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
ములకలచెరువు : రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం మండలంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు... బి.కొత్తకోట మండలం ఎగువ శీతివారిపల్లెకు చెందిన రమేష్(23) పనుల మీద బురకాయలకోటకు ద్విచక్రవాహనంలో వచ్చాడు. పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా బురకాయలకోట బైపాస్ వద్ద ఎదురుగా వస్తున్న కోటేశ్వర్‌రెడ్డి ద్విచక్రవాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో రమేష్‌కి తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు 108 సహాయంతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వరదయ్యగారిపల్లి
ఆలయంలో చోరీ
రాజంపేట : మండలంలోని వరదయ్యగారిపల్లి అక్కమ్మతల్లి ఆలయంలో చోరీ జరిగింది. మంగళవారం ఈ విషయాన్ని మన్నూరు సీఐ కులాయప్ప తెలిపారు. హుండీలు పగులకొట్టి అందులో నగదును తీసుకెళ్లిన దృశ్యాలను సీసీ ఫుటేజ్ ఆధారంగా రికార్డు చేశామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. క్లూస్ టీమ్ కూడా ఆలయాన్ని పరిశీలించిందన్నారు.
మందుల కోసం వచ్చాడు.. బంగారు చైన్ లాక్కెళ్లాడు
ప్రొద్దుటూరు క్రైం : వృద్ధురాలి మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి పట్టపగలే బంగారు చైన్‌ను లాక్కొని పారిపోయాడు. త్రీ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని హోమస్‌పేటలో సుభాషిణి అనే 70 ఏళ్ల వృద్ధురాలు కొన్నేళ్లుగా ఆయుర్వేద మందులను తయారు చేసి విక్రయిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం మందులు తీసుకునేందుకు గుర్తు తెలియని భార్యాభర్తలు అక్కడికి వచ్చారు. భార్య బయట ఉండగా భర్త లోపలికి వెళ్లాడు. తన భార్యకు ఆరోగ్య సమస్య ఉందని మందులు ఇవ్వమని అడిగాడు. ఆమె మందులు ఇచ్చే క్రమంలో మెడలోని బంగారు చైన్‌ను లాక్కొని ఆమెను తోసేశాడు. దీంతో ఆమె కింద పడిపోయింది. దొంగ అక్కడి నుంచి బయటికి పరుగెత్తి భార్యతో కలిసి ఆటోలో పారిపోయాడు.
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు


