వీఆర్‌ఓ అవినీతిపై నివేదిక ఇవ్వండి
– సబ్ కలెక్టర్ మేఘస్వరూప్
మదనపల్లె : మండల తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వో లంచం వసూళ్లపై సోషల్‌మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తలపై శుక్రవారం సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ స్పందించారు. బీకే.పల్లె పంచాయతీలో ఓ భూమి భాగపరిష్కారాల్లో భాగంగా అన్నదమ్ములకు మ్యుటేషన్ చేసేందుకు రూ.5లక్షలు వీఆర్వో వసూలు చేశాడన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా తహసీల్దార్ ధనంజయులు, ఆర్‌ఐ భరత్‌ను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై రెవెన్యూ సిబ్బందిని సబ్ కలెక్టర్ కార్యాలయానికి పిలిపించి విచారించారు. అలాగే బాధిత రైతులను, పంచాయతీ వీఆర్వోలను క్షేత్రస్థాయిలో విచారించాలన్నారు. అవినీతికి పాల్పడినట్లు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
వేర్వేరు ఘటనలో
ఇద్దరు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నంకు పాల్పడి స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలకడ మండలం నడిమిచెర్ల గ్రామానికి చెందిన చంద్రయ్య కుమారుడు రమణ(48) కుటుంబ సమస్యల కారణంగా పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డాడు. అదే విధంగా మదనపల్లె పట్టణం శేష్‌మహల్ ప్రాంతానికి చెందిన యువకుడు (18) తల్లిదండ్రులు మందలించారని లక్ష్మణరేఖ తిని ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డాడు. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబ సభ్యులు బాధితులను మదనపల్లె ప్రభుత్వజిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంఽధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు.
టాక్టర్‌ను ఢీకొన్న లారీ
సంబేపల్లె : చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిపై శుక్రవారం టాక్టర్‌ను లారీ ఢీకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని నారాయణరెడ్డిపల్లె పంచాయతీ ముదినేని వడ్డిపల్లెకు చెందిన నాగేంద్ర టాక్టర్‌లో రాయచోటి వెళుతున్న క్రమంలో నారాణరెడ్డిపల్లె సమీపంలో పిలేరు నుంచి వస్తున్న లారీ ముందు వెళుతున్న టాక్టర్‌ను ఢీకొంది. ప్రమాదంలో టాక్టర్ డ్రైవర్ గాయపడ్డారు. 108 వాహనంలో అతడిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
టమాటా లారీ బోల్తా..
సుండుపల్లి వాసి మృతి
రాయచోటి : చిన్నమండ మండలం కేశాపురం చెక్‌పోస్టు వద్ద టమాటా లారీ బోల్తా పడి ఒకరు మృతి చెందారు. శుక్రవారం రాత్రి గుర్రంకొండ మండలం తరిగొండ నుంచి టమాటాల లోడుతో నంద్యాలకు వెళుతున్న వాహనం కేశవరం చెక్ పోస్ట్ వద్ద లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో సుండుపల్లి మండలం రాచంవాండ్ల పల్లెకు చెందిన వెంకటరమణ (53) టమాటా లారీ కిందపడి మృతి చెందాడు. సుండుపల్లి నుంచి వివాహానికి వెళ్తున్న ఆయన చెక్ పోస్ట్ వద్ద బస్సు దిగి రోడ్డు పక్కన ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారిస్తున్న చిన్నమండెం పోలీసులు తెలిపారు.


