స్కూటీని ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి
కమలాపురం : కమలాపురం రైల్వే గేటు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని రాం నగర్‌కు చెందిన మహిళ మృతి చెందింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం రాం నగర్‌కు చెందిన సరోజ(48) తన కూతురు మౌనికతో కలసి స్కూటీలో క్రాస్ రోడ్డు నుంచి కమలాపురం పట్టణంలోకి వెళ్తుండగా రైల్వే గేటు వద్దకు రాగానే ప్రమాదవశాత్తు స్కూటీని ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో సరోజ స్కూటీ నుంచి కింద పడింది. ట్రాక్టర్ టైర్ తలపై ఎక్కడంతో సరోజ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ విద్యా సాగర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతురాలి కుమార్తె మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా సరోజ మృతి చెందిన విషయం తెలియడంతో రాం నగర్‌లో విషాద ఛాయలు అలుము కున్నాయి.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరు యువకులు మృతి
చింతకొమ్మదిన్నె : కడప–చిత్తూరు జాతీయ రహదారిపై బుగ్గలేటిపల్లె గ్రామం వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వేంపల్లె మౌలాలి(19), వెంకట జగదీశ్వర్ (20) అనే ఇరువురు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మూలవంక గ్రామానికి చెందిన వేంపల్లె మౌలాలి, అతని స్నేహితుడు వెంకట జగదీశ్వర్‌తో కలిసి మంగళవారం రాత్రి బుగ్గలేటిపల్లె వద్ద డాబాకు భోజనానికి వెళ్లి తిరిగి ఇంటికి బైకుపై వస్తుండగా విష్ణు విద్యామందిర్ స్కూల్‌కు వద్ద రాయచోటి వైపు నుంచి కడపకు వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వేంపల్లె మౌలాలి, వెంకట జగదీశ్వర్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. వెంకట జగదీశ్వర్ అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. వేంపల్లె మౌలాలి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వారి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. దీంతో మూలవంక గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వెంకట జగదీశ్వర్ బెంగళూరులో బీబీఏ చదువుతున్నాడు. తండ్రి కరోనా కాలంలో మృతి చెందాడు. ఏకై క కుమారుడు కావడంతో తల్లి, అక్క హృదయవిదారకంగా విలపించారు. మౌలాలి బీకాం చదువుతూ పారిశ్రామిక సంస్థలో విధులు నిర్వహిస్తున్నాడని సమాచారం.
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని వక్ఫ్ పరిరక్షణ కమిటీ(జేఏసీ) జిల్లా కన్వీనర్ అహ్మద్ బాబు బాయ్ పేర్కొన్నారు. బుధవారం ఆప్‌కీ ఆవాజ్ రాష్ట్ర కార్యాలయంలో మహిళా కన్వీనర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో జరిగే కార్యక్రమాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ సవరణ బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సూచనల ప్రకారం పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వక్ఫ్ పరిరక్షణ కమిటీ జేఏసీ జిల్లా మీడియా ఇన్‌చార్జి మగ్బూల్ బాషా మాట్లాడుతూ త్వరలో మహిళలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్‌కీ ఆవాజ్ నగర ఉపాధ్యక్షుడు ఆబిద్ హుస్సేన్. జేఏసీ కో కన్వీనర్లు రిజ్వానా, మెహనూర్, ఫాతిమా, నిరోఫర్, అక్కర్నిసా, హసీనా, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
స్కూటీని ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి
స్కూటీని ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి


