ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం
సిద్దవటం: ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని రాష్ట్ర ప్రాజెక్టు మేనేజర్ సురేష్‌బాబు తెలిపారు. సిద్దవటంలోని వెలుగు కార్యాలయంలో బుధవారం వ్యవసాయ సహాయకులకు ప్రకృతి వ్యవసాయంపై ఒక్కరోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని టక్కోలు, మాచుపల్లె గ్రామాల్లోని రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం మనం తినే ఆహారం అంతా విషపూరితమే అని అన్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల ఆరోగ్యవంతంగా ఉండవచ్చని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై మహిళా సమాఖ్యలతో భాగస్వామ్యం , ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. రైతు సాధికార సంస్థ.. స్వయం సహాయక సంఘాలు, గ్రామ సమాఖ్య సంఘాలతో సంప్రదించి ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎస్.వి. ప్రవీణ్, అదనపు ప్రాజెక్టు మేనేజర్ వసంతకుమారి, బద్వేల్ సహాయ వ్యవసాయ సంచాలకులు నాగరాజ, మండల వ్యవసాయధికారి రమేష్‌రెడ్డి, ఏపిఎం సుజాత, మండల సమాఖ్య అధ్యక్షురాలు , వివోఏలు పాల్గొన్నారు.


