సీపీఎంతో నారాయణరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు
కడప సెవెన్‌రోడ్స్ : తమ పార్టీతో బి.నారాయణరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, 2023 నుంచి ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ స్పష్టం చేశారు. శుక్రవారం సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తమ పార్టీ జిల్లా కమిటీ తీర్మానాన్ని వివరించారు. ఈనెల 3, 18 తేదీల్లో నారాయణరెడ్డి , ఆయన కుటుంబ సభ్యుల భూ కబ్జాలపై పత్రికల్లో కథనాలు ప్రచురించారని, అయితే తమ పార్టీతో అతడికి ఎలాంటి సంబంధం లేన్నారు. సీపీఎం పద్ధతులకు భిన్నంగా వ్యవహారించిన తమ పార్టీ జిల్లా కార్యదర్శులను, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులను, జిల్లా కమిటీ సభ్యులను, పూర్తి కాలపు కార్యకర్తలను బహిష్కరించిన ఉదంతాలు గతంలో చాలా ఉన్నాయని పేర్కొన్నారు. చెమ్ముమియాపేట గ్రామ సర్వే నెంబరు 344లోని స్థలాన్ని మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీలో 2017లో తమ పార్టీ విజ్ఞప్తి మేరకు సుందరయ్య స్మారక కేంద్రం లైబ్రరీకి కేటాయిస్తూ తీర్మానం చేశారని పేర్కొన్నారు. సదరు స్థలాన్ని కబ్జాకోరులు ఆక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసిన వెంటనే ఈ విషయాన్ని ఈనెల 2వ తేది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చామన్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం వల్ల ఆ స్థలంలో కార్పొరేషన్ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారని తెలిపారు. భగత్‌సింగ్ కాలనీలోని కమ్యూనిటీ స్థలాన్ని అధికారులు, స్థానిక ప్రజల అభీష్టం మేరకు కమ్యూనిటీ లైబ్రరీగా మార్చాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. నారాయణరెడ్డికిగానీ, వారి కుటుంబ సభ్యులకుగానీ పట్టా ఎలా వచ్చిందో విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. నారాయణరెడ్డి భూ కబ్జాలపై ఏవైనా కథనాలు రాసేవారు తమ పార్టీ పేరు ఉపయోగించరాదని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మనోహర్, ఎ.రామ్మోహన్, వి.అన్వేష్‌తోపాటు దస్తగిరిరెడ్డి పాల్గొన్నారు.
ఆయనకు ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు
సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్


