నాటుసారా తయారు చేస్తే చర్యలు
పెద్దమండ్యం : తండాల్లో నాటుసారా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మధుసూధనరావు హెచ్చరించారు. మండలంలోని ముసలికుంట పంచాయతీ దామ్లానాయక్‌తండాలో శుక్రవారం నాటుసారా తయారీ, విక్రయాలపై అందిన సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు. ఓ పాడుబడిన ఇంటిలో నిలువ ఉన్న నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితుడు ఎవరనేది విచారిస్తున్నట్లు చెప్పారు. అలాగే తండాలో మరో వ్యక్తి వద్ద ఉన్న 5 లీటర్ల నాటుసారా, 5 కేజిల బెల్లం స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనంతరం తండా వాసులతో ఆయన మాట్లాడుతూ నాటుసారా తయారీ, విక్రయాలు చేస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. సారాను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. నాటుసారా తయారీ, విక్రయాలతో జరుగుతున్న అనర్థాల గురించి వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న కార్పొరేషన్ రుణాలు, ఇండస్ట్రియల్ ద్వారా అందిస్తున్న రుణాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ మాధవి, సిబ్బంది పాల్గొన్నారు.


