రెచ్చిపోతున్న మట్టి మాఫియా
కురబలకోట : మండలంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. చెరువులు, గుట్టలు, డీకేటీ భూముల్లో మట్టిని అక్రమంగా తరలిస్తూ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కొద్ది రోజులుగా అంగళ్లు గ్రామంలోని గుర్రాలవారిపల్లి వద్ద డీకేటీ భూముల్లో కనసానివారిపల్లెకు చెందిన మధు, కృష్ణమూర్తి జేసీబీలతో ఇష్టాను సారంగా రాత్రింబవళ్లు మట్టిని తోలి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం ఆదివారం రెవెన్యూ అధికారుల ఆదేశాలతో అంగళ్లు వీఆర్వో ఖాదర్ బాషా దృష్టికి వచ్చింది. ఆయన నేరుగా ఒక్కడే వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో మట్టి మాఫియా నిర్వాహకుడు మధు వీఆర్వో మోటార్ సైకిల్ తాళాలను లాక్కున్నాడు. మట్టి తోలితే మీ వల్ల ఏమవుతుందని ప్రశ్నించాడు. ఆపై బరితెగించి దౌర్జన్యానికి దిగాడు. దీంతో పోలీసుల సహకారంతో వీఆర్వో మట్టి తోలుతున్న జేసీబీలను, ఏడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ముదివేడు పోలీసులకు అప్పగించారు. వారు వాటిని సీజ్ చేసి మైనింగ్ శాఖకు నివేదిక పంపారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ దిలీప్‌కుమార్ తెలిపారు.
అడ్డుకున్నందుకు వీఆర్వోపై దౌర్జన్యం
రెండు జేసీబీలు, ఏడు ట్రాక్టర్లు సీజ్
రెచ్చిపోతున్న మట్టి మాఫియా


