ఒంటరి జీవితంపై విరక్తితో వృద్ధుడి ఆత్మహత్య
మదనపల్లె : ఒంటరి జీవితం, ఆపై అనారోగ్యం, వృద్ధాప్యం, తదితర సమస్యలతో మనస్థాపం చెంది ఓ వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం మదనపల్లె మండలంలో జరిగింది. పట్టణంలోని కోటవీధిలో నివాసం ఉంటున్న గందోడి చెంగయ్య (76), భార్య లక్ష్మిదేవమ్మలకు ఒకే కుమార్తె అరుణ ఉండగా, ఆమెకు చాలా కాలం క్రితం గుర్రంకొండకు చెందిన మురళితో వివాహం జరిపించారు. 15 సంవత్సరాల క్రితం భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో కోట వీధిలోని ఇల్లు బాడుగకు ఇచ్చి లక్ష్మిదేవమ్మ పట్టణంలోని దేవత నగర్‌లో నివాసం ఉంటోంది. చెంగయ్య మదనపల్లె మండలం దుబ్బిగానిపల్లి పంచాయతీ ఎనుములవారిపల్లె సమీపంలోని వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు. కుమార్తె అప్పుడప్పుడు వృద్ధాశ్రమానికి వెళ్లి అవసరమైన వస్తువులు అందించి పలకరించి వచ్చేది. ఇటీవల చెంగయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేవాడు. కుమార్తె తనను కలిసిన సందర్భంలో, అనారోగ్యం వేధిస్తోందని జీవితంపై ఆసక్తి లేదని నిర్లిప్తంగా మాట్లాడేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం స్థానికుడైన నాగరాజ పాలు పోసేందుకు వృద్ధాశ్రమానికి వెళ్లగా, చెంగయ్య తాను ఉంటున్న గదిలో ఫ్యానుకు పంచెతో ఉరి వేసుకుని వేలాడుతూ ఉండడాన్ని గమనించాడు. వెంటనే స్థానికులు, పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న తాలూకా ఎస్‌ఐ గాయత్రి ఆత్మహత్యకు గల కారణాలను స్థానికులను విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుమార్తె అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు.


