ఉగ్రదాడి పిరికిపంద చర్య
రాయచోటి అర్బన్ : జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడి పిరికిపంద చర్య అని వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడ్డారు. ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా బుధవారం సాయంత్రం రాయచోటి పట్టణంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లు చిల్లీస్ ఫయాజ్‌బాషా, ఫయాజుర్ రహిమాన్, కౌన్సిలర్లు కొలిమి చాన్‌బాషా, ఈశ్వర్ ప్రసాద్, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఫయాజ్ అహమ్మద్, అబూజర్, సుగవాసి శ్యామ్‌కుమార్, మురికినాటి వెంకట్రామిరెడ్డి, విజయభాస్కర్, ఇర్ఫాన్ పాల్గొన్నారు.
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలి
రాయచోటి టౌన్ : ఉగ్ర దాడి హేయమైన చర్య అని రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేసేందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. దేశమంతా ఒక్కటై ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించాలని పిలుపునిచ్చారు.
ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం
రామసముద్రం : జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పు ల్లో సుమారు 30 మంది పర్యాటకులు మృతి చెందిన ఘటనకు నిరసనగా బుధవారం బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ సర్కిల్‌లో ఉగ్రవాదుల దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఇలాంటి ఘటనలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని, దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చి ఉగ్ర మూకలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బండి ఆనంద్, జర్మన్ రాజు, కృష్ణమూర్తి, ఆనంద్‌నాయుడు, సుబ్రమణ్యం నాయుడు, నవీన్, చలపతి, తదితరులు పాల్గొన్నారు.
ఉగ్రదాడి పిరికిపంద చర్య


