●గతంలో ఒకలా.... ప్రస్తుతం మరోలా...
నా పేరు కడియాల జయరామయ్య, వైకోట గ్రామం, ఓబులవారిపల్లి మండలం, అన్నమయ్యజిల్లా. నేను 3.50 ఎకరాలు అరటి సాగు చేసాను. పంట చేతికి వచ్చే సమయంలో వర్షం, ఈదురుగాలులతో పంట అంతా నేలవాలింది. ఒక అరటిగెల కూడా పనికి రాకుండా పోయింది. ఎకరాకు సుమారు రూ.50 వేల వరకు ఖర్చు చేసాను. పెట్టుబడి కూడా రాకుండా పోయింది.
నా పేరు సిద్ధక నాగిరెడ్డి. నాది కస్తూరిరాజుగారిపల్లె గ్రామం, సిద్దకవాండ్లపల్లె, లక్కిరెడ్డిపల్లె మండలం, అన్నమయ్య జిల్లా. నాకు నాలుగు ఎకరాల మామిడి తోట ఉంది. నాలుగు రోజుల క్రితం ఈదురుగాలు బీభత్సానికి చేతికి అందిన మామిడి కాయలు కాస్త నేల రాలిపో యాయి. ఇప్పటికే రెండు లక్షలకు పైబడి ఖర్చు పెట్టాను. ప్రతి ఏడాది ఏప్రిల్, మే మాసంలో పంట చేతికి అందే సమయంలో ఈదురు గాలు లు మామిడి రైతులను నట్టేట ముంచేస్తున్నాయి.
● తల్లడిల్లిపోతున్న పండ్ల తోటల రైతులు
● మండు వేసవిలో పెనుగాలుల ప్రభావం
● రైల్వేకోడూరు, రామాపురం,రాజంపేట, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో మామిడికి భారీ నష్టం
సాక్షి రాయచోటి: ఆరుగాలం శ్రమించి...అష్టకష్టాలు పడిన అన్నదాతకు చివరకు నిరాశే మిగులుతోంది. ఎప్పుడు చూసినా ఏదో ఒక రూపంలో పంట దెబ్బతినడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిసారి ప్రకృతి పండ్ల తోటల రైతులను దెబ్బతీస్తూనే ఉంది. మండు వేసవిలో పెనుగాలులు, వడగండ్ల ప్రభావం ఏమిటో వాతావరణ నిపుణులకు సైతం అంతుచిక్కడం లేదు. పంట నోటికాడికి వచ్చి నేడో, రేపో చేతికందేలోపు ప్రకృతి దెబ్బకు కూలిపోతోంది. వాతావరణ మార్పుల ప్రభావంతో రైతన్నలకు మాత్రం వ్యవసాయంలో నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. గత వారం, పది రోజులుగా జిల్లాలో పెనుగాలులు, వడగండ్ల ప్రభావానికి పండ్ల తోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు.
అరటిపై ‘పెను’ ప్రభావం
అన్నమయ్య జిల్లాలో పెనుగాలుల ప్రభావం అరటి పంటపై పడింది. గెలలతో ఉన్న అరటి పంట గాలుల ధాటికి నిలువునా నేలకొరిగింది. ప్రధానంగా రైల్వేకోడూరు నియోజకవర్గంతోపాటు రాజంపేట ప్రాంతంలో అరటి రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఆ రెండు నియోజకవర్గాల్లో సుమారు 400 ఎకరాల్లో అరటి పంట దెబ్బతిన్నట్లు ఉద్యానశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా పెద్ద ఎత్తున నష్టం కలిగింది. ఎప్పుడూ కూడా ఇలా వేసవిలో గాలుల ప్రభావం లేదని, ఈ విచిత్రమైన పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని రైతులు అంటున్నారు.
మామిడి రైతులకు కోలుకోలేని దెబ్బ
అన్నమయ్య జిల్లాలో మామిడి రైతుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. గాలులతోపాటు వడగండ్ల వర్షానికి లక్కిరెడ్డిపల్లె మండలంలోని కుర్నూతల, రామాపురం మండలం రాచపల్లె, గువ్వలచెరువు, సుగాలితాండాతోపాటు పీలేరు, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాలలో వేలాది ఎకరాల్లో మామిడి కాయలు గాలులకు నేల రాలాయి. ఈ సీజన్‌లో పూత రాక కొందరు, కాయలు కాయక మరికొందరు ఇలా అల్లాడుతున్న తరుణంలో గోరుచుట్టుపై రోకలిపోటులా అన్నో ఇన్నో కాసిన కాయలు గాలుల ప్రభావంతో రాలిపోయాయి.
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలోని వైఎస్ జగన్ సర్కార్ రైతులకు సంబంధించి పెద్ద పీట వేసేవారు. మొదట్లోనే పెట్టుబడి సాయం మొదలుకొని ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, పావలా వడ్డీ రుణాలు ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకునేది. అంతేకాకుండా ఇలాంటి ప్రకృతి విపత్తులు ఏర్పడినపుడు ఆగమేఘాలపై నష్టనివారణకు వెంటనే ఇన్‌ఫుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టేవారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా లేకపోగా, రైతు భరోసాపై కూడా నీలినీడలు అలుముకున్నాయి. మరోవైపు ప్రకృతి విపత్తుతో రైతులు పండ్ల తోటల్లో తీవ్ర నష్టం ఎదుర్కొంటున్నా వారికి భరోసా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపినా అసలు వస్తాయో, రావో అన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది.
150 హెక్టార్లలో అరటి నష్టం
అరటి రైతులకు సంబంధించి ఇటీవల ఒకటి, రెండు విడ తల్లో పెనుగాలులతోపాటు వడగండ్ల వాన దెబ్బతీసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 150 హెక్టార్లకుపైగా రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో అరటి పంట దెబ్బతింది.
– రవిచంద్రబాబు, జిల్లా ఉద్యానశాఖ అధికారి
●గతంలో ఒకలా.... ప్రస్తుతం మరోలా...
●గతంలో ఒకలా.... ప్రస్తుతం మరోలా...
●గతంలో ఒకలా.... ప్రస్తుతం మరోలా...
●గతంలో ఒకలా.... ప్రస్తుతం మరోలా...


