పింఛన్‌ చూసి ఒకటో తారీఖు గుర్తుకొస్తోంది | navaratnalu schemes in andhra pradesh | Sakshi
Sakshi News home page

పింఛన్‌ చూసి ఒకటో తారీఖు గుర్తుకొస్తోంది

Published Fri, Dec 1 2023 5:06 AM | Last Updated on Fri, Dec 15 2023 12:37 PM

navaratnalu schemes in andhra pradesh - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.  

బతుకు పంట పండింది 
పచ్చటి పంట చేలో నీళ్లు పెడుతూ.. పంటను సంరక్షించుకుంటూ పొలం పనిలో నిత్యం నిమగ్నమై పోవాలనేది నా కల. నేను గిరిజన రైతుని. నాకు నాలుగు ఎకరాల 20 సెంట్ల భూమి ఉంది. మా భూమి పూర్తిగా వర్షాధారం. వర్షం నీటిపై ఆధారపడి పంటలు పండించాల్సిన పరిస్థితి. నీరు సరిపోక పత్తి పంట వేసినప్పుడల్లా నష్టాలపాలయ్యేవాడిని. ఆదాయం అంతంతమాత్రంగా ఉండడంతో కుటుంబ పోషణ కష్టంగా ఉండేది. గతేడాది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జలకళ పథకంలో భాగంగా నా పొలంలో బోరు వేయించింది. ఉచిత కరెంటు కనెక్షన్‌ కూడా ఇచ్చింది.

దీంతో ఈ ఏడాది ఎకరం భూమిలో మొక్కజొన్న, 1.20 ఎకరాల్లో వైట్‌ బార్లీ వేశాను. మిగిలిన పొలంలో పొగాకు పంట సాగు చేశాను. జలకళ బోరు వల్ల పంటలకు పుష్కలంగా నీరందింది. నాలుగు డబ్బులు చేతికందే అవకాశముంది. దీంతో నా బతుకు పంట పండినట్లే. మాది ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కాకులవారిగూడెం గ్రామం. నాకు భార్య, ఓ బాబు. ఏటా రైతు భరోసా కింద రూ.13,500 వస్తోంది. ఈ సొమ్ము పంట పెట్టుబడికి సరిపోతుంది. రైతు భరోసా కేంద్రం నుంచి ఎరువులు తీసుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వ హయాంలో రైతులకు వ్యవసాయం పండుగైంది. నాలాంటి గిరిజన రైతులు ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాయి.     – కమ్మే శ్రీనివాసరావు, కాకులవారిగూడెం (కోడూరి ఆనంద్, విలేకరి, బుట్టాయగూడెం) 

నాలుగు ముద్దలు నోట్లోకెళ్తున్నాయి.. 
గత ప్రభుత్వ హయాంలో రూ.200 చాలీచాలని పింఛను ఇచ్చేవారు. నా భర్త శ్రీమోను కాలం చేశారు. కుమార్తెకు పెళ్లి చేసి పంపాను. ఇక ఇంట్లో ఉండేది నేను ఒక్కదాన్నే. నేను కూలికి వెళితే 200 రూపాయలు వస్తుంది. ఆరోగ్యం బాగోలేని రోజు ఆ డబ్బులు కూడా ఉండవు. పింఛనే నాకు ఆధారం. ఇటువంటి సమయంలో అవసరాలు తీరడానికి అప్పులు చేసేదాన్ని. అయితే, నిత్యం ఏ మోహం పెట్టుకుని అప్పులోళ్ల దగ్గరకు వెళ్లగలను? దీంతో తరచూ ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కొనేదాన్ని.

ఈ ప్రభుత్వం పుణ్యమా అని ప్రస్తుతం పింఛన్‌ రూ.2,750 వస్తుండడంతో ఆనందంగా జీవిస్తున్నాను. వలంటీరే ప్రతి నెలా ఒకటవ తేదీన ఇంటికి వచ్చి పింఛను ఇస్తున్నారు. ఇప్పుడు నేను ఇంటి అవసరాల కోసం అప్పులు చేయడం లేదు. మానసిక ఒత్తిడి లేకుండా జీవిస్తున్నాను. సంతోషంగా నాలుగు ముద్దలు నోట్లోకి వెళ్తున్నాయి. ఈ ప్రభుత్వం నాకు మరో మేలు చేసింది. లే అవుట్‌ వేసి, సెంటున్నర ఇంటి స్థలం కూడా మంజూరు చేసింది. అద్దె ఇంట్లో ఉన్న నాకు ఇంటి స్థలం ఇవ్వడం సంతోషంగా ఉంది. తొందరలో అక్కడ ఇల్లు కట్టుకుంటాను.     – పరదేశి రత్నమ్మ, మిట్నాల, నంద్యాల.  (కె.చంద్రవరప్రసాద్, విలేకరి, నంద్యాల న్యూటౌన్‌) 


భిక్షాటన మానేశాం.. 
నేను, మా ఆయన సింహాద్రి   రో­జూ ఊరూరా తిరిగి భిక్షాటన చేసేవాళ్లం. మేం బుడగ జంగాలం. భిక్షాటన మా కులవృత్తి. ఆ విధంగా వచ్చిన ఆదాయంతో ఎలాగోలా ఇద్దరు ఆడ పిల్లలు, ఇద్దరు మగ పిల్లలను నెట్టుకొస్తుండేదాన్ని. ఏమాత్రం ఆరోగ్యం సహకరించకపోయినా ఆరోజు గడప దాటి వెళ్లలేకపోయేవాళ్లం. అప్పుడు పస్తులుండాల్సి వచ్చేది. కిందా మీదా పడి అందరికీ పెళ్లిళ్లు చేశాం. ఒకబ్బాయి తాపీ పని చేస్తుండగా... మరో కొడుకు ఆరోగ్యం అంతంత మాత్రమే. ఇద్దరబ్బాయిలు వారి భార్యలతో కలిసి మాతో పాటే ఉంటున్నారు.

ఈ పరిస్థితిలో కుటుంబ పోషణ ఎలా.. అని దిగులు పడుతుండేవాళ్లం. ఆ తరుణంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైఎస్సార్‌ చేయూత పథకం కింద ఏటా రూ.18,750 నా ఖాతాలో వేసింది. గత మూడేళ్లుగా పైకం అందింది. దానితోపాటు మూడేళ్లుగా ఆసరా పథకం ద్వారా కూడా డబ్బు అందుతోంది. ఆ వచ్చిన మొత్తంతో మా సొంతూరైన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మహర్తాపురంలో పాన్‌షాపు పెట్టుకున్నాను. నా భర్తకు పింఛన్‌ వస్తోంది. మనవళ్లకు అమ్మ ఒడి కింద డబ్బులొస్తోంది. తద్వారా మేము ఇప్పు­డు కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటున్నాం. భిక్షాటన మానేసి గౌరవంగా బతుకుతున్నాం.       – ప్రసాదం యల్లమ్మ, మహర్తాపురం   (అల్లు నర్సింహరావు, విలేకరి, కొత్తూరు) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement