బాపట్ల: ఓటర్ల జాబితాలో లింగ నిష్పత్తి తేడా అధికంగా ఉంటే సహించేది లేదని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, వృద్ధుల సంక్షేమ శాఖల ప్రభుత్వం కార్యదర్శి, రోల్ అబ్జర్వర్ ఏ. సూర్యకుమారి తెలిపారు. సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాపై ఈఆర్‌ఓలు, ఏఈఆర్వోలతో బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో ఆమె సమావేశం నిర్వహించారు. పర్చూరు, చీరాలలో నియోజకవర్గాలలో లింగ నిష్పత్తి సరిగా లేకపోవడంపై అధికారులను నిలదీశారు. చీరాల, వేమూరు నియోజకవర్గాలలోని బీఎల్‌వోలు సరిగా పనిచేయడం లేదని గుర్తించామని, అధికారులు నిర్లిప్తంగా ఉంటే కుదరదని తెలిపారు. గైర్హాజరైన పర్చూరు ఈఆర్‌ఓకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. మృతుల ఓట్లు తొలగింపు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే బాధ్యత అధికారులపై ఉందని ఆమె స్పష్టం చేశారు. కొత్త ఓటర్లను చేర్పించడం కోసం అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాకు 2.73 లక్షల దరఖాస్తులు వచ్చాయని, తక్షణమే వాటిని గడువులోగా పరిష్కరించాలని తెలిపారు. ఆధార్ అనుసంధానం ప్రక్రియ కేవలం 84 శాతం ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ జరగాలంటే ప్రతి ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలని ఆదేశించారు.
గడిచిన ఎనిమిది నెలల్లో 3,163 మంది ఓటర్లు వలసలు వెళ్లడంపై ఆరా తీశారు. జనవరిలో సవరణ ఓటర్ల జాబితా విడుదల చేస్తామని తెలిపారు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరిస్తున్నామని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. మృతుల ఓటర్లపై విచారణ జరిపి తొలగిస్తామని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు పాల్గొన్నారు.
మహిళా, శిశు సంక్షేమ, వృద్ధుల సంక్షేమ శాఖల కార్యదర్శి ఏ.సూర్యకుమారి


