బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
కొరిటెపాడు: బ్యాంకింగ్ పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ఇదే డిమాండ్‌తో ఈ నెల 24, 25వ తేదీల్లో చేపట్టిన సమ్మెను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అనుబంధంగా ఉన్న ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ కమిటీ సమావేశం శనివారం గుంటూరులోని ఓ ప్రైవేటు హోటల్‌లో జరిగింది. కార్యవర్గ సమావేశాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ, ఏపీ రాష్ట్ర కౌన్సిల్ కార్యదర్శి కె.రామకృష్ణ ప్రారంభించారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి యూనియన్ ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కె.రామకృష్ణ మాట్లాడుతూ అన్ని బ్యాంకుల్లో లక్షల ఖాళీలు ఉన్నాయని, సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలోని ప్యారీ స్కూల్ ఆఫ్ కామర్స్, కామర్స్ విభాగం ప్రొఫెసర్ ఎ. వెంకటాచలం బ్యాంకింగ్ సేవలలో ఆల్ అప్లికేషన్ – ఎథికల్ గవర్నెన్స్, విజిలెన్స్ అనే అంశంపై ప్రసంగించారు. ఏఐటీయూసీ ఏపీ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ రాధాకృష్ణ మూర్తి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ అంజిరెడ్డి వజ్రాల మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం–ప్రజాస్వామ్యం– కార్మిక సంఘాల పాత్ర అనే అంశంపై ప్రసంగించారు. సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు ఎం.ఎస్.కుమార్, గుంటూరు జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సమితి అధ్యక్షుడు రవిచంద్రారెడ్డి, కార్యదర్శి బాషా, కమిటీ మాజీ కార్యదర్శి కాం.కిషోర్, జాయింట్ జనరల్ సెక్రటరీ కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment