ముండ్లమూరు (కురిచేడు): గంజాయి విక్రయం కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో శనివారం వివరాలను ఆయన వెల్లడించారు. గంజారయి సరఫరా చేస్తున్న ముండ్లమూరు మండలం ఈదరకు చెందిన బడా లక్ష్మీనారాయణ, మార్టూరు మండలం నాగరాజుపల్లికి చెందిన జడా శ్రీహరి, అదే గ్రామానికి చెందిన మొగిలి వంశీ, ఉప్పు శివగోపీలను మండలంలోని వేంపాడు ఆంజనేయస్వామి ఆలయం వద్ద శుక్రవారం సాయంత్రం ఎస్‌ఐ వై.నాగరాజు సిబ్బందితో కలసి అరెస్టు చేశారు. నిందితుడు లక్ష్మీనారాయణపై గతంలో మార్టూరు, చీరాల టౌన్, నరసరావుపేట– 2 టౌన్ పోలీసుస్టేషన్లలో గంజాయి కేసులు నమోదయ్యాయని డీఎస్పీ తెలిపారు. ఉప్పు శివగోపీపై వేటపాలెం పోలీసుస్టేషన్‌లో గంజాయి కేసు, జడా శ్రీహరిపై మార్టూరు పోలీస్‌స్టేషనులో వివిధ కొట్లాట కేసుల నమోదైనట్లు తెలిపారు. తాజాగా అంతా కలిసి కొంతకాలంగా సామర్లకోటకు చెందిన ఒక వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నారు. బాపట్ల జిల్లాలోని మార్టూరు, ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వారికి తెలిసిన వ్యక్తుల ద్వారా అమ్ముతున్నారు. దర్శి సీఐ రామారావు, ముండ్లమూరు ఎస్‌ఐ నాగరాజులకు సమాచారం రావడంతో వారి కదలికలపై నిఘా పెట్టారు. శుక్రవారం ఈదరకు వచ్చి తిరిగి ఒంగోలు వెళ్తుండగా అరెస్టు చేసినట్లు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. నిందితుల వద్ద నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దర్శి సీఐ రామారావు కేసు దర్యాప్తు చేపట్టి ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment