శబ్ద కాలుష్యం నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి
డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ విజయమ్మ
బాపట్ల: శబ్ద కాలుష్యం నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ విజయమ్మ పేర్కొన్నారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా సోమవారం ఏర్పాటుచేసిన ప్రదర్శనను డాక్టర్ విజయమ్మ ప్రారంభించారు. డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వినికిడి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. చెవి వినడం ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పెద్ద, పెద్ద శబ్దాల నుంచి చెవిని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలోని హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 10వతేదీ లోపు తెలియచేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టీఐఎస్) ద్వారా రూపొందించామన్నారు. జాబితాలు జిల్లా విద్యాశాఖ, ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయాలతో పాటు విద్యాశాఖ వెబ్‌సైట్, నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అభ్యంతరాలు తెలిపే ఉపాధ్యాయులు తమ పూర్తిపేరుతో కూడిన వివరాలు, జాబితాలోని తప్పిదం స్పష్టంగా పేర్కొనటంతో పాటు ఆధారాలు సమర్పించాలని సూచించారు. గడువు ముగిసిన తరువాత అందిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోమన్నారు. వచ్చిన అభ్యంతరాలపై ఫిర్యాదుల పరిష్కార కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తెలియచేస్తారని తెలిపారు. వివరాలకు జిల్లా విద్యాశాఖ, జోనల్ విద్యాశాఖ కార్యాలయాలలో సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment