విద్యుత్ వైర్లు తగిలి గడ్డి ట్రాక్టర్‌కు మంటలు
పర్చూరు(చినగంజాం): డ్రైవర్ చాకచక్యంతో పెనుప్రమాదం తప్పింది. వరిగడ్డి లోడుతో వెళుతున్న ట్రాక్టర్‌కు విద్యుత్ వైర్లు తగిలి నిప్పులు చెలరేగడంతో తీవ్రంగా మంటలు చెలరేగి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన మండలంలోని వీరన్నపాలెం గ్రామంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన యార్లగడ్డ శ్రీనివాసరావు అనే రైతుకు చెందిన వరిగడ్డిని పొలం నుంచి ఇంటికి చేరుస్తున్నాడు. ఈక్రమంలో వరిగడ్డి ట్రాక్టర్ పంచాయతీ కార్యాలయం ముందుగా వెళ్తున్న సమయంలో ఆ మార్గంలో వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి వరిగడ్డి పూర్తిగా తగలబడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో ట్రాక్టర్ డ్రైవర్ ఆనందరావు చాకచక్యంగా వ్యవహరించాడు. తానేమాత్రం భయాందోళనకు గురికాకుండా గడ్డిని పక్కన పడేసి అందులో ఉన్న కూలీలను, ట్రాక్టర్‌ను కాపాడాడు. వెంటనే స్థానికులు మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గడ్డి పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.50 వేలు వరకు నష్టం వాటిల్లి ఉంటుందని సమాచారం.
వీరన్నపాలెంలో అగ్నిప్రమాదం
డ్రైవర్ చాకచక్యంతో కూలీలు, ట్రాక్టర్ సురక్షితం
Comments
Please login to add a commentAdd a comment