కుట్ర రాజకీయాలపై ఉగ్రరూపం
అధికారం అండ చూసుకుని కాల‘కూటమి’ విషం చిమ్ముతూనే ఉంది. గుంటూరు నగరపాలక సంస్థపై పెత్తనం చలాయించడానికి మాయోపాయాలు పన్నుతూనే ఉంది. నిస్సిగ్గుగా సంతలో పశువులను కొన్నట్లు కార్పొరేటర్లను కొన్న కూటమి నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. కమిషనర్‌ను అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారు. అడుగడుగునా మేయర్ కావటిని అవమానపరున్నారు. నగరపాలక సంస్థపై కూటమి పెత్తనంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆయన పదవికి రాజీనామా చేశారు. ఇటు జిల్లా పరిషత్‌లోనూ చైర్‌పర్సన్ అరాచకాలకు అడ్డూఅదుపూ లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులతో, అత్యవసర పనుల పేరుతో కోట్లాది రూపాయల విలువైన పనులకు ముందస్తు అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు బడ్జెట్ సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు.
● వేడెక్కిన గుంటూరు జిల్లా రాజకీయం ● ఒకే రోజు రెండు పరిణామాలు ● మేయర్ పదవికి కావటి మనోహర్ రాజీనామా ● జెడ్పీ సమావేశాన్ని బహిష్కరించిన వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు ● కోరం లేక వాయిదా ● రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిరసిస్తూ నిర్ణయాలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తూ, ప్రజలతో ఎన్నుకోబడిన స్థానిక సంస్థలను అపహాస్యం చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని నిరసిస్తూ గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పదవికి శనివారం రాజీనామా చేశారు. మరోవైపు అధికారాన్ని అడ్డం పెట్టుకుని బడ్జెట్ ఆమోదించకుండానే రూ. 12 కోట్ల విలువైన పనులను ముందుగానే ఆమోదించుకోవడానికి జెడ్పీ చైర్‌పర్సన్ పేరుతో కూటమి ప్రజా ప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాన్ని వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు అడ్డుకున్నారు. సమావేశానికి వారు రాకపోవడంతో కోరం లేక వాయిదా వేయాల్సి వచ్చింది.
సంతలో పశువుల్లా కార్పొరేటర్ల కొనుగోలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికి గుంటూరు నగరపాలక సంస్థలో వైఎస్సార్ సీపీ పాలక వర్గం పూర్తి మెజార్టీతో అధికారంలో ఉంది. ఎలాగైనా దొడ్డిదారిలో స్థాయీ సంఘాన్ని దక్కించుకునేందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు మహ్మద్ నసీర్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు కుట్ర పన్నారు. కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసి సంతలో పశువులను కొన్నట్లు కొనుగోళ్లకు తెరలేపారు. వారే స్వయంగా కార్పొరేటర్ల ఇంటికి వెళ్లి మరీ కండువాలు కప్పి వచ్చారు.
వంత పాడుతున్న కమిషనర్
నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు కూడా రాజకీయ నాయకుడిలా టీడీపీ నేతల వంత పాడారు. చిన్న అంశాన్ని అడ్డం పెట్టుకుని కౌన్సిల్‌ను బాయ్‌కాట్ చేసిన ఆయన తర్వాత మేయర్ ఎన్నిసార్లు లేఖలు రాసినా కౌన్సిల్ సమావేశం పెట్టకుండా అడ్డం పడ్డారు. దొడ్డిదారిన స్థాయీ సంఘాన్ని అందిపుచ్చుకున్న తర్వాత ఎమ్మెల్సీ కోడ్ ముగియడంతో తాజాగా మేయర్ ప్రమేయం లేకుండానే స్థాయీ సంఘం సమావేశం తేదీని నిర్ణయించి ప్రకటించేశారు. అజెండా విషయంలో కూడా మేయర్‌ను సంప్రదించలేదు.
కుట్ర రాజకీయాలపై ఉగ్రరూపం
Comments
Please login to add a commentAdd a comment