సాక్షి ప్రతినిధి,బాపట్ల: అతనిపేరు మున్నా. అతనిది ఈ జిల్లాకాదు, ఈ రాష్ట్రం కాదు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం స్వస్థలం. కూటమి అధికారంలోకి వచ్చాక పర్చూరు ఎమ్మెల్యే అతనిని తన ప్రతినిధిగా పర్చూరులో తెచ్చి పెట్టారు. ఇప్పుడు మున్నా పర్చూరుకు షాడో ఎమ్మెల్యే. నియోజకవర్గంలో అందరినోళ్లలో అతనిపేరే నానుతోంది. అధికార వర్గాల్లోనూ అతని మాటే శాసనం. పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం పెద గొల్లపాలెం గ్రామంలో ఏప్రిల్ 1న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గురువారం ఆ గ్రామంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి, ఎస్పీ తుషార్ డూడీ, జేసీ ప్రఖర్‌జైన్, ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడులు పర్యటించారు. సీఎం పర్యటన ఏర్పాట్ల గురించి మున్నాతో చర్చించడంతో ఇప్పుడు మున్నా పేరు మరోమారు హాట్ టాఫిక్‌గా మారింది. అదేసమయంలో విమర్శలకు దారితీసింది. స్థానిక నేతల సంగతి పక్కనబెడితే అధికారులు సైతం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మున్నాతోనే చర్చించడంపై అక్కడున్న అధికారులతోపాటు స్థానిక నేతలు ముక్కున వేలేసుకున్నారు. పైగా అతనితో చర్చిస్తున్న ఫొటోలను పౌరసంబంధాల శాఖ మరీ గ్రూపులో పెట్టి ప్రచారం చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అన్నింటా మున్నాయే...
పర్చూరు నియోజకవర్గంలో ప్రధాన వనరుగా ఉన్న గ్రానైట్ పాలీసింగ్ పలకలను ప్రభుత్వానికి సేల్‌టాక్స్, మైనింగ్ టాక్స్‌లు చెల్లించకుండా నిత్యం వంద నుంచి 120 లారీల గ్రానైట్ పలకలు ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలిస్తారు. ఈ దందాను ఎమ్మెల్యే అనుచరులు నడిపిస్తుండగా మున్నాయే పర్యవేక్షిస్తారన్న విమర్శలున్నాయి. ఇదే నియోజకవర్గంలో చినగంజాం మండలం కడవకుదురు ప్రాంతం నుంచి గత పదినెలలుగా హైదరాబాద్‌కు నిత్యం వందల లారీల ఇసుక తరలిపోతోంది. ఎమ్మెల్యే ఏలూరి తరుపున ఇసుక అక్రమ రవాణా వ్యవహారాలను మున్నానే పర్యవేక్షిస్తారన్న ఆరోపణలున్నాయి. ఇక నియోజకవర్గంలో ఇప్పటివరకూ ఉన్న గ్రావెల్ క్వారీల అనుమతులు బలవంతంగా రద్దు చేయించి మార్టూరు ప్రాంతంలోని కొండలనుంచి నిత్యం వందలాది లారీల గ్రావెల్‌ను తరలించి పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఈ అక్రమ దందా వెనుక మున్నా హస్తముందని నియోజకవర్గంలో ప్రచారం వుంది. మొత్తంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు మున్నా షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారని నియోజకవర్గంలో విస్తృత ప్రచారం ఉంది.
షాడో ఎమ్మెల్యేతో సీఎం పర్యటనపై చర్చలు
మున్నాతో కలెక్టర్, ఎస్పీ, జేసీ,
ఆర్డీవో సంప్రదింపులు
పర్చూరులో ఇసుక, గ్రావెల్, గ్రానైట్
దందాను నడిపిస్తున్న వ్యక్తిగా
మున్నాపై ఆరోపణలు
ఎమ్మెల్యే ఏలూరి తరపున
అక్రమ కార్యకలాపాలు
మున్నాతో అధికారుల చర్చలపై
నిర్ఘాంతపోతున్న అధికారులు, నేతలు
ఐఅండ్‌పీఆర్ గ్రూపులో ఫొటోలు
చూసి విమర్శలు