
తీరంలో సందడే...సందడి
చీరాలటౌన్/బాపట్ల: బాపట్ల సమీపంలోని సూర్యలంక, వాడరేవు సముద్ర తీర ప్రాంతాలకు మంగళవారం పర్యాటకులు పోటెత్తారు. ముస్లింలకు అతిపెద్ద పండుగైన రంజాన్ పండుగ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర స్నానాలు ఆచరిస్తుంటారు. దీంతో ముస్లింలు తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు సూర్యలంక, వాడరేవు తీరానికి చేరుకున్నారు. చిన్నారులు, యువకులు ఉత్సాహంగా కేరింతలు కొడుతు సముద్రంలో స్నానమాచరించి ఆనందోత్సాహాలతో సందడి చేశారు. తీరం ఒడ్డున యువకులు సేదతీరుతూ సంతోషంగా గడిపారు. చీరాల వాడరేవు తీరానికి పర్చూరు, అద్దంకి, పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, ప్రత్తిపాడు, గుంటూరు ప్రాంతాలకు చెందిన ముస్లింలు తమ కుటుంబ సభ్యులతో చేరుకుని స్నానాలు ఆచరించారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి కూడా ముస్లిం సోదరులు అధికంగా వాడరేవుకు చేరుకుని స్నానాలు ఆచరించారు. వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు, మైరెన్ పోలీసులు, సివిల్ పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. సముద్రంలో లోతుకు ఎవ్వరిని వెళ్లనీయకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయించారు. వాచ్ టవర్, ఏఈటీ వాహనం, మైక్ అనౌన్స్‌లు చేపట్టారు. వాడరేవులో ట్రాఫిక్ సమస్య లేకుండా ట్రాఫిక్ పోలీసులు క్రమబద్దీకరణ చర్యలు చేపట్టారు.
తరలివచ్చిన ముస్లింలు
పోలీసుల పటిష్ట బందోబస్తు

తీరంలో సందడే...సందడి