చెంతనే కృష్ణమ్మ...నీటికి చింత | - | Sakshi
Sakshi News home page

చెంతనే కృష్ణమ్మ...నీటికి చింత

Apr 2 2025 1:27 AM | Updated on Apr 2 2025 1:27 AM

చెంతనే కృష్ణమ్మ...నీటికి చింత

చెంతనే కృష్ణమ్మ...నీటికి చింత

కొల్లూరు: వర్షాకాలంలో తీర గ్రామాలను ముంచెత్తే కృష్ణమ్మ ఆ తర్వాత కాలాల్లో అందనంత దూరం వెళ్లిపోతోంది. తీర ప్రాంతంలో ఇష్టానుసారం ఇసుక, మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో తాగు, సాగునీటి కష్టాలు ప్రజలను వెంటాడుతున్నాయి. వేసవి ఆరంభంలోనే నీటి లభ్యత అంతంతమాత్రంగా ఉంది. రానున్న మూడు నెలలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేమూరు, రేపల్లె నియోజకవర్గాలలోని పలు గ్రామాలు కృష్ణా తీరం వెంబడి ఉన్నాయి. ఈ గ్రామాలలో వాణిజ్య పంటలైన పసుపు, అరటి తదితరం సాగుచేస్తుంటారు. ఒకప్పుడు తాగు, సాగు నీటికి కొరత లేదు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీనికితోడు సముద్ర జలాలు చొచ్చుకొని వచ్చి భూగర్భ జల ఉప్పుగా మారిపోతుండటంతో పంటలకు సాగు నీటి లభ్యత తగ్గడంతోపాటు, ప్రజలు తాగు నీరు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నీటిని పీల్చేస్తున్న అక్రమ తవ్వకందారులు

కృష్ణా తీరంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అందుకు ప్రధాన కారణం అక్రమార్కులు ఇష్టానుసారంగా ఇసుక, మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలను వినియోగించి పరిమితులకు మించి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఇటుకరాయి బట్టీల నిర్వాహకులు ఇటుకరాయి తయారీకి అవసరమైన మట్టి కోసం తీర ప్రాంతంలో వేల ఎకరాల్లో ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఇది భూగర్భ జలాలపై పెను ప్రభావం చూపుతుంది. భూగర్భ జల నిల్వలు అడుగంటుతున్న కొద్దీ సముద్ర జలాలు చొచ్చుకు వస్తున్నాయి. దీంతో లంక గ్రామాల్లో భూగర్భ జలాలు ఉప్పుగా మారుతున్నాయి.

సాగు నీటి కోసం రైతుల పాట్లు

తీర ప్రాంతంలోని ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. సారవంతమైన భూములున్నప్పటికీ భూగర్భ జలాలు అడుగంటి పోతుండటంతో పంటలకు నీరందక దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఎకరాకు రూ.లక్షలు పెట్టుబడులు పెట్టి సాగుచేస్తున్న పంటలకు నీరు అందకపోవడంతో రైతుల శ్రమకు తగిన ఫలితం దక్కడంలేదు. వర్షాలు లేక నీటి వనరుకు బోర్లే ప్రధానం అవడంతో నీటి కోసం కష్టాలు పడుతున్నారు. గతంలో వేసిన బోర్ల నుంచి నీరు రాకపోవడంతో ఆరు నుంచి పది అడుగులు లోతును మించి గుంతలు తీసి వరలు ఏర్పాటు చేసి విద్యుత్‌ మోటర్లు ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమంలో బావుల్లో ఏర్పాటుచేసిన బోర్లు సైతం నీటిని తోడలేక మొండి కేస్తుండటంతో కొత్త బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో 40 అడుగుల లోతులో బోరు వేస్తే నీరు అందితే, ప్రస్తుతం 110 అడుగులు మించి బోరు వేయాల్సి వస్తుందంటే పరిస్థితి తీవ్రత అర్ధమవుతుంది. కొత్తగా బోరు వేస్తున్న రైతులు బోరు ఖర్చులు, సబ్‌ మెర్సిబుల్‌ మోటరు ఖర్చుతో కలుపుకొని సుమారు రూ.లక్షకు పైగా వెచ్చించాల్సి వస్తుంది. పంట దిగుబడులు తగ్గి చేతికందిన పంటకు గిట్టుబాటు ధర అందకపోవడంతో వ్యవసాయంపై అంతగా ఆసక్తి చూపడం లేదు. గృహాలలోని తాగు నీటి పంపులు సైతం మొరాయిస్తుండటంతో తిరిగి 110 అడుగుల లోతు వరకు పైపులను దించి కొత్త పంపులు వేసుకుంటున్నారు. అందుకు రూ. 50 వేలకు పైగా వెచ్చించాల్చి వస్తుండటం పేద, మధ్యతరగతి కుటుంబాలకు అదనపు భారంగా మారుతుంది.

అడుగంటుతున్న భూగర్భ జలాలు

తాగు, సాగు నీటికి తీర

ప్రాంత ప్రజల ఇబ్బందులు

ఇసుక, మట్టి తవ్వకాలతో

సమస్య జఠిలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement