నర్సరీ భూముల నష్ట పరిహారంపై విచారణ
రెంటచింతల: మాచర్ల – దాచేపల్లి బైపాస్ రోడ్డు(ఎన్‌హెచ్–167 ఏడీ) నిర్మాణంలో భాగంగా రెంటచింతలలో రెండు షేడ్ నెట్ నర్సరీలకు సంబంధించి కోల్పోయిన భూములను శనివారం గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు నేషనల్ హైవే అథారిటీ విజయవాడ ఏఈ ప్రకాష్ నేతృత్వంలోని బృందంతో కలిసి పరిశీలించారు. ఇటీవల రెంటచింతల గ్రామానికి దుగ్గింపూడి జోసఫ్‌రెడ్డి, నరమాల రామకృష్ణ అనే ఇద్దరు రైతులు జాతీయ రహదారి 167 ఏడీ నిర్మాణం వలన తాము ఏర్పాటు చేసుకున్న షేడ్ నెట్ నర్సరీ భూములను కోల్పోయామని, ఇంతవరకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందలేదని పూర్తిస్థాయిలో విచారించి న్యాయం చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబుకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ నేపధ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు రైతులు కోల్పోయిన 787, 788 సర్వే నంబర్లలో ఏర్పాటు చేసిన నర్సరీ భూమిని పునఃపరిశీలించేందుకు ఈ బృందం వచ్చిందన్నారు. జాతీయ రహదారి నిర్మాణం వలన ఒక్కో షేడ్ నెట్ నర్సరీ నిర్వహకులు ఎంత భూమిని కోల్పోయారు.. తదితర వివరాలను సేకరించారు. ఈ రెండు నర్సరీలకు సంబంధించి మొత్తం 0.68 ఎకరాల భూమి కోల్పోయినట్లు మండల ఆర్‌ఐ పల్లా రామకృష్ణ తెలిపారు. జిల్లా కలెక్టర్‌కు పూర్తి నివేదికను అందజేయనున్నట్లు ఆర్డీఓ మురళీకృష్ణ తెలిపారు. వారి వెంట జిల్లా ఉద్యానఅధికారి సీహెచ్‌వీ రమణారెడ్డి, తహసీల్దార్ మూఢావత్ అర్జున్ నాయక్, జాతీయ సెక్షన్ ఇంజినీర్ శ్రీనివాస్, గురజాల హెచ్‌ఓ వై.మోహన్, సర్వేయర్ నవులూరి రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment