
వివాహిత అనుమానాస్పద మృతిపై కేసు
గుంటూరు రూరల్: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. సీఐ వంశీధర్ కథనం ప్రకారం నల్లపాడు గ్రామానికి చెందిన రాజుకు, మామిళ్ళపల్లికి చెందిన సృజన (23)తో ఏడాది క్రితం వివాహమైంది. ఇటీవల నుంచి భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సృజన మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన సృజన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భర్తే తమ కుమార్తెను చంపాడని, ఉరివేసుకుందని సృష్టించాడని ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసునమోదుచేసి దర్యాప్త చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రాజును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.
చిట్‌ఫండ్ బాధితుల విచారణ
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): నరసరావుపేటలోని సాధన చిట్‌ఫండ్ బాధితులను సీఐడీ గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం విచారణ చేశారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఎప్పటి నుంచి చిట్‌లు వేస్తున్నారు? ఎంత మొత్తంలో నెల నెలా చెల్లిస్తున్నారనే అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సుమారు 15 మందికిపైగా బాధితుల వద్ద వివరాలు సేకరించారు. అలాగే నరసరావుపేటలోని ఓ ప్రైవేటు బ్యాంక్ ప్రతినిధులు కూడా తమ గోడును సీఐడీ అధికారులకు వినిపించారు.
అప్పుల బాధ తాళలేక మహిళ ఆత్మహత్య
దామరపల్లి(తాడికొండ): వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పుల బాధ పెరిగి కుటుంబ పోషణ భారంగా మారడంతో మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన తాడికొండ మండలం దామరపల్లి గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తాడికొండ మండలం దామరపల్లి గ్రామానికి చెందిన వట్టికూటి శ్రీనివాసరావు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. గత కొన్నేళ్లుగా వ్యవసాయంలో నష్టం వస్తుండటంతో ఉన్న 3 ఎకరాలు అమ్మి అప్పులు తీర్చారు. కౌలుకు పొలం తీసుకొని వ్యవసాయం చేస్తుండగా ఈ ఏడాది కూడా తీవ్రంగా నష్టం రావడంతో మనస్థాపం చెందారు. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడికి గురిచేస్తుండటంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారడంతో మనస్థాపంతో శ్రీనివాసరావు భార్య అరుణ కుమారి ఈనెల 14న పొలానికి వేసేందుకు తెచ్చిన గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరులోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా మంగళవారం ఉదయం మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతులకు రిజర్వ్ ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి ముగ్గురి వద్ద నుంచి రూ.13 లక్షలు నగదు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై అరండల్‌పేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. అరండల్‌పేట పోలీసుల కథనం ప్రకారం.. ఆంజనేయ పేట ప్రాంతంలో రుద్రా ఫౌండేషన్ యజమాని అయిన అరమండ రవికుమార్ అనే వ్యక్తి 2022లో ఉద్యోగవకాశాల పేరుతో పత్రికా ప్రకటనలు చేశాడు. ఆ ప్రకటనలు చూసిన పల్నాడు జిల్లా యడ్లపాడుకు చెందిన పాలపర్తి కోటేశ్వరమ్మ రవికుమార్‌ను కలిశారు. అతని మాయమాటలు నమ్మి రూ.5లక్షలు చెల్లించారు. అలాగే గడ్డల వంశీ అనే వ్యక్తి రూ.3 లక్షలు, గొట్టిపాటి మరియదాసు అనే వ్యక్తి రూ.5 లక్షలు రవికుమార్‌కు ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయినట్టు గుర్తించిన బాధితులు అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పట్టాభిపురం సీఐ పోస్టుపై సందిగ్ధం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): పశ్చిమ సబ్ డివిజన్‌లోని పట్టాభిపురం పీఎస్ సీఐ పోస్టుపై సందిగ్ధం నెలకొంది. వీఆర్‌లో ఉన్న సీఐ ఎం.మధుసూదనరావును ఈనెల 16న పట్టాభిపురం పీఎస్ సీఐగా నియమిస్తూ ఓ పోలీస్ ఉన్నతాధికారి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. అప్పటి వరకు విధుల్లో ఉన్న వీరేంద్రబాబును సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఈ క్రమంలో కొత్త సీఐగా మధుసూదనరావు అదే రోజు రాత్రి స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించారు. అయితే గుంటూరు రేంజ్ కార్యాలయం నుంచి ఈ పోస్టింగ్‌కు బ్రేక్‌పడినట్లు తెలుస్తోంది. దీంతో సందిగ్ధం నెలకొంది. బుధవారం సాధ్యమైనంత వరకు ఆయనే మళ్లీ సీఐగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

వివాహిత అనుమానాస్పద మృతిపై కేసు
Comments
Please login to add a commentAdd a comment