ప్రజాస్వామ్య విలువలకు ‘కూటమి’ తూట్లు
నరసరావుపేట: ప్రజాస్వామ్యం, విలువల గురించి ఎన్నికలకు ముందు మాట్లాడిన కూటమి ప్రభుత్వ నాయకులు అధికారంలోకి వచ్చాక వాటికి తూట్లు పొడుస్తున్నారని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్‌కుమార్ విమర్శించారు. స్థానిక కోటప్ప కొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో గురువారం జిల్లా కమిటీ సభ్యులు వై.రాధాకృష్ణ అధ్యక్షతన పల్నాడు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. విజయ్‌కుమార్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20వేలు ఇవ్వకుండా మొండిచేయి చూపారని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరలు, దిగుబడులు లేక రైతాంగం అల్లాడుతోందని చెప్పారు. రైతుల పక్షాన మాట్లాడిన రైతు సంఘం నాయకులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా అమలు చేసి, వలసలు నివారించి, 200 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కూలీలు వలస వెళ్తున్న క్రమంలో ప్రమాదాల బారిన పడి ఆరుగురు చనిపోగా, 70 మందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు. వారందరికీ న్యాయం చేయాలని విజయకుమార్ కోరారు. బనకచర్ల పేరుతో వరికపూడిశెల ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు, రైతులను ఏకం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. వెనకబడిన పల్నాడు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పార్టీ చేపట్టే పోరాటాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో యూటీఎఫ్ ప్రకటించిన అభ్యర్థి విజయం కోసం పనిచేసిన నాయకులు, ప్రజాసంఘాలపై కూటమి నేతలు బెదిరింపులకు పాల్పడడం తగదని ఆయన ఖండించారు. ఎన్నికల రోజున ఓటమి భయంతోనే కూటమి నేతలు ఏజెంట్లపై దాడులు, రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఏపూరి గోపాలరావు, జి.రవిబాబు, అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, ఎస్.ఆంజనేయనాయక్, సీనియర్ నాయకులు గద్దె చలమయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.శివకుమారి పాల్గొన్నారు.
సూపర్ సిక్స్ హామీల అమలు ఎప్పుడు ? పంట కాలం ముగిసే వరకు సాగునీరు ఇవ్వాలి సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో గుంటూరు విజయకుమార్
Comments
Please login to add a commentAdd a comment