నీటి కుంటలు వెంటనే నిర్మించాలి | - | Sakshi
Sakshi News home page

నీటి కుంటలు వెంటనే నిర్మించాలి

Published Sat, Mar 22 2025 2:04 AM | Last Updated on Sat, Mar 22 2025 2:03 AM

నీటి

నీటి కుంటలు వెంటనే నిర్మించాలి

జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి

బాపట్ల: పంట నీటి కుంటలు యుద్ధప్రాతిపదికన నిర్మించాలని జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి తెలిపారు. పల్లె పండుగ, పంట నీటి కుంటల నిర్మాణంపై ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌ కళ్యాణ్‌ అమరావతి నుంచి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీక్షణ సమావేశం నిర్వహించిన అనంతరం జిల్లా అధికారులతో జె.వెంకట మురళి సమీక్షించారు. నిరుపేదలకు మాత్రమే ఉపాధి హామీ పథకం ద్వారా పారదర్శకంగా పనులు కల్పించాలన్నారు. పండ్ల తోటల సాగు విస్తీర్ణం ఏడాదిలో లక్ష ఎకరాలకు పెరగాలని సూచించారు. పల్లె పండుగ కార్యక్రమంలో నిర్దేశించిన మేరకు సీసీ రోడ్లు, గోకులాలు నిర్మించాలని పేర్కొన్నారు. జిల్లాలోని 276 గ్రామ పంచాయతీలలో 4 వేల పంట నీటి కుంటల నిర్మాణానికి లక్ష్య నిర్దేశం చేశారు. శనివారం అన్ని ప్రాంతాలలో నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి నుంచి రైతులను కాపాడటానికి ఈ కుంటలు ఎంతో ఉపయుక్తం అవుతాయన్నారు. ఇప్పటికే అధికారికంగా 1,524 కుంటల పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 878 గోకులాల షెడ్‌లు మంజూరు కాగా, ప్రస్తుతం 551 నిర్మాణంలో ఉన్నట్లు పేర్కొన్నారు. పల్లె పండుగ కార్యక్రమం కింద 881 సీసీ రోడ్లు నిర్మించాల్సి ఉందని తెలిపారు. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారుల ద్వారా 157.5 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. రూ.103.1 కోట్ల నిధులతో నిర్మిస్తున్న రహదారులు లక్ష్యం మేరకు ఏప్రిల్‌ 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తి చేసిన సీసీ రోడ్లన్నింటినీ ఉగాది పండుగ రోజు ప్రారంభించాలన్నారు. 241 అంగన్వాడీ కేంద్రాల భవనాలకు మరమ్మతులు చేయించాలని పీఆర్‌ ఇంజినీర్లను ఆదేశించారు. పెయింటింగ్‌ పనులు చేయించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం పనులలో దొంగ మస్టర్లు వేయడం వంటివి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ హెచ్చరించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూలీలతో పనులు చేయించరాదన్నారు. వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడకుండా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. బోర్ల మరమ్మతులు పంచాయతీ నిధులతో చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌ లో ఉన్న 12,500 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారుల గృహాలన్నింటిలో వ్యక్తిగత మరుగుదొడ్లను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ నిధులతో నిర్మించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్‌ గౌడ్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా గీతంపై మనో భేటీ

బాపట్ల: బాపట్ల జిల్లా గీతాన్ని పాడాలని జిల్లా కలెక్టర్‌ జె .వెంకట మురళి చేసిన విజ్ఞప్తి మేరకు ప్రముఖ గాయకుడు మనో సానుకూలంగా స్పందించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ను ఆయన చాంబర్లో కలిశారు. చందోలు బంగళాముఖి దేవాలయానికి వెళ్తూ మార్గమధ్యలో ఆయన కలెక్టర్‌తో భేటీ అయ్యారు. కలెక్టర్‌ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. జిల్లా గీతంపై చర్చించుకున్నారు. కలెక్టర్‌ కోరిక మేరకు బాపట్ల జిల్లా గీతాన్ని ఆలపించడానికి మనో అంగీకరించారు. జిల్లా గీతం కోసం నిర్వహించిన పోటీలకు 10 ఎంట్రీలు వచ్చాయి. వీటిని అప్పటి జిల్లా విద్యాశాఖ అధికారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలించి, భావపురి రచయుతల సంఘం కార్యదర్శి నందిరాజు విజయ్‌ కుమార్‌ రచించిన గీతాన్ని ఎంపిక చేసింది. జిల్లా విశిష్టతపై ఫోరం ఫర్‌ బెటర్‌ బాపట్ల వారు ప్రచురించిన కరపత్రాన్ని కలెక్టర్‌ ద్వారా మనోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి డాక్టర్‌ పి.సి. సాయిబాబు, కాకుమాను గురుకుల పాఠశాల సంగీత ఉపాధ్యాయులు అచ్యుతుని నాగపూర్ణ రమాదేవి, పుస్తకోడ్యమ సమితి కార్యదర్శి జీవీ పాల్గొన్నారు.

వడదెబ్బ నివారణకు ప్రత్యేక చర్యలు

పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి అధికారులకు తెలిపారు. వడగాల్పులకు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రణాళికపై అధికారులతో శుక్రవారం ఆయన స్థానిక కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. మార్చి నుంచి జూన్‌ వరకు జిల్లాలో ఎండ తీవ్రత, వడగాల్పులు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందన్నారు ప్రతి మండల కేంద్రంలో 4 చలివేంద్రాల చొప్పున ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్‌ గౌడ్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నీటి కుంటలు వెంటనే నిర్మించాలి 1
1/2

నీటి కుంటలు వెంటనే నిర్మించాలి

నీటి కుంటలు వెంటనే నిర్మించాలి 2
2/2

నీటి కుంటలు వెంటనే నిర్మించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement