
సిజేరియన్లు చేసే ఆస్పత్రులకు నోటీసులివ్వండి
గుంటూరు మెడికల్: నూరు శాతం సిజేరియన్ చేసిన ప్రైవేటు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర అదనపు సంచాలకులు డాక్టర్ అనిల్‌కుమార్ ఆదేశించారు. బుధవారం గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జిల్లా ప్రొగ్రాం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. డాక్టర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ నూరు శాతం సిజేరియన్లు చేసిన ప్రైవేటు ఆసుపత్రుల్లో జిల్లా టీమ్‌లతో తనిఖీలు చేయాలని చెప్పారు. ఆ ఆసుపత్రులపై నిఘా ఏర్పాటు చేయాలని, సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో లభించే మందుల వివరాలు ప్రతిరోజూ తప్పనిసరిగా ఆసుపత్రి నోటీసు బోర్డులో అందరికీ కన్పించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. క్షయ వ్యాధిగ్రస్తులను సత్వరమే గుర్తించి చికిత్స అందించాలని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహించే క్షయ వ్యాధి పరీక్షల వివరాలు తప్పనిసరిగా సేకరించి ఉన్నతాధికారులకు తెలియజేయాలని చెప్పారు. జిల్లాలో ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే కుక్కకాటు, పాముకాటు కేసుల వివరాల గురించి ఆరా తీశారు. సంబంధిత వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా జిల్లా వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రసవాలు ఆరోగ్య కేంద్రాల్లో పెంచేందుకు సంబంధిత పీహెచ్ వైద్య అధికారులకు ఆదేశాలు మార్గదర్శకాలు జారీ చేయాలని ఆదేశించారు. ఆర్సీహెచ్, హెచ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో గర్భిణుల నమోదు నూరు శాతం తప్పనిసరి చేయాలన్నారు. గర్భిణీలు, చిన్నారులకు నూరు శాతం వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని చెప్పారు. జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాల గురించి డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రావణ్‌బాబు, డాక్టర్ రత్నమన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెంచండి అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్‌కుమార్